బొట్టు పెట్టుకొని మదర్సా వెళ్లిందని..!

7 Jul, 2018 16:06 IST|Sakshi
బాధిత విద్యార్థిని

తిరువనంతపురం : మత సంప్రదాయాలు, కట్టుబాట్లు మంటగలిపిందనే కారణంగా ఐదో తరగతి విద్యార్థినిని మదర్సా నుంచి బహిష్కరించిన ఘటన ఉత్తర కేరళలో చోటుచేసుకుంది. వివరాలు... కేరళకు చెందిన ఉమర్‌ మలయిల్‌ అనే వ్యక్తి కూతురు మదర్సాలో విద్యనభ్యసిస్తోంది. ఐదో తరగతి చదువుతున్న ఆమె ఒక షార్ట్‌ ఫిలింలో నటించేందుకు సిద్ధపడింది. నటనలో భాగంగా నుదటిపై గంధాన్ని బొట్టుగా ధరించింది. దీంతో ఆగ్రహించిన మదర్సా యాజమాన్యం.. ముస్లిం అయివుండి ఇలాంటి చర్యకు పాల్పడడం ఎంత మాత్రం సబబు కాదని పేర్కొంటూ ఆమెను బహిష్కరించింది.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తండ్రి తన కూతురి పట్ల మదర్సా వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. ‘ చదువుతో పాటు ఆటపాటల్లోనూ ముందు ఉండే నా కూతురు అనేక బహుమతులు పొందింది. ఎంతో ప్రతిభావంతురాలైన నా కూతుర్ని మదర్సా నుంచి తొలగించారనే వార్త తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను. నుదుటన గంధపు తిలకం ధరించడమే ఆమె చేసిన పొరపాటు అని వారు చెప్పారు. ఆ సమాధానానికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదంటూ’  ఉమర్‌ మలయిల్‌ వాపోయారు. కాగా ఆయన పోస్టుకు స్పందించిన నెటిజన్లు మదర్సా తీరును తప్పు పట్టగా.. మరికొంత మంది మాత్రం ‘నీ కూతురికి సరైన శిక్ష పడింది. ఇస్లాంను, షరియా చట్టాలను ఉల్లంఘించినందుకు తగిన శాస్తి జరిగిందంటూ’  నెగటివ్‌ కామెంట్లు చేశారు. 

మరిన్ని వార్తలు