-

గుర్రపు స్వారీ చేస్తూ.. పరీక్ష కేంద్రానికి..

8 Apr, 2019 14:28 IST|Sakshi

తిరువనంతపురం: ఒకప్పుడు ఆడవారు ఇంటినుంచి అడుగు బయట పెట్టడమే పాపంగా భావించేది సమాజం. కాని ప్రస్తుతం.. కాలం మారింది. తాము ఏ విషయంలోనూ పురుషులకంటే తక్కువ కాదని.. అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపిస్తూనే ఉన్నారు నేటితరం మహిళలు. పరీక్షకు ఆలస్యమవుతుండటంతో.. పరీక్ష రాయకుంటే సంవత్సరమంతా పడ్డ కష్టం వృథా అవుతుందని భావించిన ఓ బాలిక ఏకంగా గుర్రపు స్వారీ చేసుకుంటూ పరీక్ష కేంద్రానికి వెళ్లింది. కేరళలోని త్రిశూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

త్రిశూరు జిల్లాలో పదవ తరగతి పరీక్ష కేంద్రానికి ఒక బాలిక స్కూలు బ్యాగును భుజాన వేసుకుని గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్లడం చూపరులను ఆశ్చర్యపరిచింది. గుర్రపు స్వారీ చేస్తూ వేగంగా వెళ్తున్న బాలికను ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అయితే  ఈ వీడియోను వాట్సాప్‌ గ్రూప్‌లో చూసిన మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహింద్ర ట్విటర్‌ వేదికగా బాలికపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘త్రిశూర్‌లో ఆమె ఎవరికన్న తెలుసా? నాకు ఆమె ఫోటో కావాలి. నా మోబైల్‌ స్క్రీన్‌ సేవర్‌గా ఆమె స్వారీ చేసిన గుర్రం ఫోటోను పెట్టుకుంటా. ఆమె నా దృష్టిలో హీరో. ఆమెను చూస్తే బాలికల విద్య మరింత దూసుకెళుతుందన్న ఆశ కలుగుతోంది’ అని ట్వీట్‌ చేశాడు. ‘బాలికల విద్య అద్భుతంగా ముందుకు సాగుతోందనడానికి నిదర్శనమైన ఈ వీడియో వైరల్‌ కావల్సిన అవసరం ఉంది’ అని మరో ట్వీట్‌లో ఆనంద్‌ మహింద్ర పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు