శబరిమల: బాలికను అడ్డుకున్న పోలీసులు

19 Nov, 2019 14:54 IST|Sakshi

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన బాలికను పంబ బేస్‌ క్యాంపు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు దర్శనానికి అనుమతినిచ్చి.. బాలికను వెనక్కి వెళ్లాల్సిందిగా సూచించారు. శబరిమల ఆలయంలోకి రుతుక్రమ వయసు గల మహిళలను అనుమతించే విషయమై గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పిటిషన్లను గురువారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వివాదాన్ని ఏడుగురు సభ్యులు గల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అయ్యప్ప ఆలయ తలుపులు తెరచుకోగా.. దైవ దర్శనానికి వచ్చే మహిళలకు నిరాశే ఎదురైంది. 

కాగా శబరిమల వివాదాన్ని సుప్రీంకోర్టు ఎటూ తేల్చని నేపథ్యంలో ఆలయంలోకి ప్రవేశించే మహిళలకు ఎటువంటి రక్షణ కల్పించలేమని కేరళ మత్రి ఏకే బాలన్‌ స్పష్టం చేశారు. అయినప్పటికీ కొంతమంది మహిళలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నిస్తుండగా మార్గమధ్యలోనే పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. తాజాగా ఆలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబ బేస్‌ క్యాంపు నుంచి పుదుచ్చేరికి చెందిన బాలిక కుటుంబ సభ్యులతో అయ్యప్పను దర్శించుకునేందుకు పయనం కాగా మహిళా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆధార్‌ కార్డు వివరాల ప్రకారం ఆమె వయస్సు 12 సంవత్సరాలు కాబట్టి.. ఆలయంలోకి అనుమతించలేమని తేల్చిచెప్పారు. దీంతో పాప తండ్రి తమ కూతురు ఆలయంలోకి ప్రవేశించేందుకు అర్హురాలే అని పోలీసులకు చెప్పినప్పటికీ లాభం లేకపోయింది. ఈ క్రమంలో బాలికను అక్కడే ఉండాల్సిందిగా ఆదేశించిన పోలీసులు.. కుటుంబాన్ని అనుమతించడంతో వారు కొండపైకి వెళ్లారు. బాలికను తాము బస చేసిన గదికి పంపించారు.

మరిన్ని వార్తలు