నాన్నకు చేదోడుగా.. నాగలి లాగుతూ..

1 Jul, 2018 15:01 IST|Sakshi

లక్నో :  ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతు కష్టం చూస్తే మనస్సు చలించకమానదు. తనకున్న వ్యవసాయ భూమిని దున్నడానికి ట్రాక్టర్‌ని గానీ, ఎద్దులను గానీ అరువు తెచ్చకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఆ రైతుది. కుటుంబ పరిస్థితులు తెలిసిన అతని ఇద్దరు కూతుర్లు చిన్నవాళ్లే అయిన తండ్రికి చేదోడుగా నిలిచారు. ఎలాగైనా పొలం సాగుచేసి వచ్చే పంటతో కొంతైనా తమ కష్టాలు తీర్చుకోవాలనే ఆశతో తండ్రితో పాటు పొలం చేరారు. అంతేకాకుండా తండ్రికి సాయంగా నాగలిని చెరోవైపు లాగుతూ భూమిని చదును చేశారు. ఝాన్సీ జిల్లాలోని బాడ్గాన్‌కు చెందిన 60 ఏళ్ల అచేయ్‌లాల్‌ ఓ పూరి గుడిసెలో దారిద్ర్యరేఖకు దిగువన జీవనం సాగిస్తున్నాడు. ఓ వైపు వ్యవసాయంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం.. మరోవైపు అధిక సంతానం అతని కుటుంబాన్ని దుర్భర పరిస్థితుల్లోకి నెట్టాయి.

అచేయ్‌లాల్‌కు ఆరుగురు ఆడపిల్లలు కావడంతో వారి పెళ్లిళ్లు చేయడం ఓ సామాన్య రైతుగా అతనికి తలకు మించిన భారంగా మారింది. అయినప్పటికి బతుకు మీద ఆశతో కాలంతో పోరాడుతూ.. నలుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. మిగిలిన ఇద్దరు కూతుళ్లలో రవీనా 8వ తరగతి, శివాని 7వ తరగతి చదువుతున్నారు. బడికి సెలవుల సమయంలో బాలికలిద్దరు పొలం చేరి తండ్రికి సహాకరించారు. వర్షాలు బాగా పడి.. మంచి పంట రావాలని వారు కోరుకుంటున్నారు. తాము ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలేదని ఆ బాలికలు చెబుతున్నారు. పేదరికంలో ఉన్న అచేయ్‌లాల్‌కు 1.5 లక్షల అప్పులు కూడా ఉన్నాయి. అతని కుటుంబం ధరించే దుస్తులు కూడా గ్రామస్థులు దానం చేసినవే. అంత దుర్భర జీవితం గడుపుతున్న ఆ కుటుంబం.. బీదలకు ప్రభుత్వం అందించే ఇళ్ల నిర్మాణ పథకంలో తమను లబ్ధిదారులుగా చేర్చాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ లాభం లేకపోయింది.

మరిన్ని వార్తలు