లోక్సభ ఎన్నికల్లో సినీ గ్లామర్

6 Mar, 2014 17:03 IST|Sakshi

కోల్కతా: త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో సినీ గ్లామర్తో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి సినీ, క్రీడా తారలు పెద్ద ఎత్తున బరిలోకి దిగుతుండటం విశేషం. అధికార తృణమాల్ కాంగ్రెస్ పార్టీ తరపునే ఏకంగా తొమ్మిది మంది పోటీ చేయనుండగా, బీజేపీ తరపున ఇద్దరు రంగంలోకి దిగనున్నారు. సినీ తారలకు ప్రజలతో ఉన్న అనుబంధం దృష్ట్యా వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నట్టు టీఎంసీ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

తృణమాల్ కాంగ్రెస్ తరపున నిన్నటి తరం అందాల నాయిక మున్ మున్ సేన్ పోటీ చేస్తున్నారు. బంకూర లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. సేన్ తరపున ముద్దుల కూతుళ్లు, యువ కథానాయికలు రియా, రైమా సేన్లు ప్రచారం చేయనున్నారు. ఇక మిడ్నాపూర్ నుంచి మరో నటి సంధ్యా రాయ్, ఘటల్ నుంచి బెంగాలీ సూపర్ స్టార్ దేవ్, డార్జిలింగ్ నుంచి సాకర్ స్టార్ బైచుంగ్ భూటియా టీఎంసీ తరపున బరిలో దిగనున్నారు. భూటియా స్వరాష్ట్రం సిక్కిం అయినా పశ్చిమ బెంగాల్తో ప్రత్యేక అనుబంధముంది.

సుభాష్ చంద్రబోస్ మునిమనవడు, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుగట బోస్ కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. టీఎంసీ తరపున మాజీ ఫుట్బాలర్ ప్రసూన్ బెనర్జీ, గాయకులు ఇంద్రానిల్ సేన్, సుమిత్రా రాయ్ బరిలో దిగనున్నారు. బీజేపీ తరపున మెజీషియన్ పీసీ సర్కార్, నటుడు జార్జి బెకర్ పోటీ చేయనున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు బప్పిలహరి కూడా పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేసే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. లెఫ్ట్ ఫ్రంట్ నేతలు మాత్రం ప్రజల కోసం పనిచేస్తున్న కార్యకర్తలకే అవకాశం ఇస్తామని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు