గాలిపటం ఎంత పని చేసింది..

9 Jul, 2016 10:31 IST|Sakshi

ఘజియాబాద్: రంగురంగుల్లో ఆకాశంలో విహరించే గాలిపటం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. యోగేశ్ శర్మ(52) అనే వ్యక్తి పనులు ముగించుకుని ఢిల్లీలోని తన నివాసానికి బయలుదేరాడు. దారిలో ఠాకూర్ ద్వారా ఫ్లై-ఓవర్ మీదుగా బైక్ పై వెళ్తున్న సమయంలో ఓ తెగిన గాలిపటం దారం అతని మెడకు చుట్టుకుంది. వాహనాన్ని ఆపడానికి కొద్ది మీటర్లు ముందుకు వెళ్లేసరికి ఆయన గొంతు తెగిపోయి రక్తం చిమ్మి కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యోగేశ్ చిన్న తరహా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం వ్యాపారానికి సంబంధించిన పనులు ముగించుకుని ఢిల్లీలోని మౌజ్ పురాలోని తన నివాసానికి బయలుదేరారు. బైక్ పై వెళ్తున్న సమయంలో గాలిపటం దారం మెడకు చుట్టుకోవడంతో అతని స్వరపేటికతో పాటు రక్తనాళాలు తెగిపోయినట్లు చెప్పారు.

రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించామని అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. గాలి పటం తయారీలో ఉపయోగించిన నైలాన్ దారం, సీసపు పూత కారణంగా పదునుగా తయారయిందని వివరించారు. ప్రతి ఏటా గాలిపటం దారాల వల్ల పక్షులు, ప్రజలు గాయాలపాలవుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు