‘పాకిస్తాన్‌ను ఖండఖండాలుగా తెగ నరకండి’

27 Dec, 2017 10:26 IST|Sakshi
పాకిస్తాన్‌ భూభాగం

ముంబై : పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న కుల్‌భూషణ్‌ జాధవ్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లి, భార్యలకు జరిగిన అవమానంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్‌ స్వామి తనదైన శైలిలో స్పందించారు. జాధవ్‌ను కలవడానికి వెళ్లిన ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్‌ల పట్ల పాకిస్తాన్‌ భద్రతా సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.

వారి దుస్తుల్ని మార్పించి వేరే బట్టలు వేసుకోమనడం, మెడలో ఉన్న మంగళ సూత్రాలను, గాజుల్ని తీయించడం, బొట్టు ఉండరాదనడం, బూట్లు తీయించడం, జాధవ్‌తో మాతృభాషలో సంభాషించడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవడం లాంటివి విస్మయం కలిగించాయి. చివరకు జాధవ్‌ భార్య మంగళసూత్రాలు, ఆమె బూట్లను పాకిస్తాన్‌ అధికారులు వెనక్కి ఇవ్వలేదు.

ఈ సంఘటనను ‘ద్రవపది వస్త్రాపహరణం’గా అభివర్ణించిన సుబ్రమణియన్‌ స్వామి.. జాధవ్‌ కుటుంబాన్ని అవమానించిన పాకిస్తాన్‌ గడ్డను ఖండఖండాలుగా తెగ నరకాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టాలని సూచించారు.

అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. వాస్తవాధీన రేఖ అవల భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌పై కూడా ఆయన మాట్లాడారు. ఆపరేషన్‌ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే, పాకిస్తాన్‌కు ఇది సరిపోదని, దాన్ని నాలుగు ముక్కలుగా విభజించడమే రక్త దాహాన్ని ఆపగలుగుతుందని అభిప్రాయపడ్డారు.

భారత్‌ - పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం వస్తే మరే ఇతర దేశం కూడా అందులో జోక్యం చేసుకోదని అన్నారు. ఇందుకు కారణం అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌పై ఉన్న ముద్రేనని చెప్పారు.

మరిన్ని వార్తలు