రన్‌వేపై జారి పడిన ఇంధన ట్యాంకు

8 Jun, 2019 15:14 IST|Sakshi

గోవాలో ఎయిర్‌పోర్టులో తప్పిన భారీ ప్రమాదం 

మిగ్‌ 29 కె నుంచి జారిపడిన ఆయిల్‌ ట్యాంకర్‌

రెండు గంటల పాటు కార్యకలాపాలు నిలిపివేత 

పనాజి:  గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలోభారీ ప్రమాదం  తప్పింది. ఉన్నట్టుండి యుద్ధవిమానానికి సంబంధించిన ఆయిల్‌ ట్యాంకు రన్‌వే పై జారిపడింది. దీంతో  ఇంధనం రన్‌వేపై పడి, మంటలంటుకున్నాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఈ అనుకోని ఘటనతో  ఒక్కసారిగా తీవ్ర  భయాందోళనలు  నెలకొన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ముందు జాగ్రత్త చర్యగా రెండు గంటలపాటు కార్యకలాపాలను నిలిపి వేశారు. గోవా విమానాశ్రయంలో అన్ని రకాల సేవలను రెండు గంటల పాటు  సస్పెండ్ చేశామని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు శనివారం మధ్యాహ్నం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. 

డబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో  నావీకి చెందిన మిగ్‌ 29 కె విమానంలోని  డిటాచ్‌బుల్‌ ఫ్యూయల్‌ ట్యాంకు రన్‌వేపై జారిపడిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. భారతీయ నౌకా దళానికి చెందిన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రన్‌ వేను శుభ్రపరిచి, మరమ్మతు పనులు చేపట్టారని తెలిపారు.  సాయంత్రం 4 గంటలకు యథావిధిగా  కార్యక్రమాలు తిరిగి మొదలవుతాయని తెలిపారు. యుద్ధ విమానం కూడా సురక్షితంగానే ఉన్నట్లు వారు తెలిపారు.

మరిన్ని వార్తలు