ఎంజాయ్‌ చేసేందుకు ఇక్కడకు రావొద్దు: సీఎం

15 May, 2020 14:55 IST|Sakshi

మా రాష్ట్రంలో ఆ రైలును ఆపవద్దు: గోవా ముఖ్యమంత్రి

పనాజి: వలస కార్మికుల తరలింపు నేపథ్యంలో న్యూఢిల్లీ నుంచి తిరునవంతపురం వెళ్తున్న ప్రత్యేక రైలును తమ రాష్ట్రంలోని మడగావ్‌ స్టేషనులో ఆపవద్దని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వందే భారత్‌ మిషన్‌లో భాగంగా విమానాలు, రైళ్లలో రాష్ట్రానికి చేరిన గోవా ప్రజలు, గోవా నివాసేతరులు 14 రోజుల పాటు తప్పక హోం క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు. కాగా సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నప్పటికీ మహమ్మారిని కట్టడి చేయడంలో గోవా ప్రభుత్వం సఫలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు నెల రోజులుగా అక్కడ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో బయటి ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి రాకపోకలు సాగుతుండటంతో గురువారం నాటికి ఎనిమిది మందికి కరోనా సోకింది.(పర్యాటకులను ఆహ్వానించేందుకు సిద్ధం)

ఈ నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మడగావ్‌లో రైలు దిగేందుకు దాదాపు 720 మంది టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు సమాచారం ఉంది. వారిలో గోవా వాళ్లు ఉన్నారా అన్న విషయంలో స్పష్టత లేదు. ఇక వాళ్లు ఆ స్టేషనులో దిగిన తర్వాత మేం వారికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. హోం క్వారంటైన్‌కు వెళ్లమని చెప్పాలి. అయినప్పటికీ వారు నిబంధనలు పాటిస్తారని కచ్చితంగా చెప్పలేం. అందుకే ఈ స్టేషన్‌లో రైలు ఆపవద్దని రైల్వే శాఖకు సూచించాం’’ అని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు బీచ్‌లు ఇతరత్రా చోట్లకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. ఎంజాయ్‌ చేసేందుకు వాళ్లు గోవాకు రాలేదని గుర్తుపెట్టుకోవాలని అసహనం వ్యక్తం చేశారు. విమానాల్లో వస్తున్న వారికి ఎయిర్‌పోర్టులో .. అదే విధంగా షిప్పుల్లో రాష్ట్రానికి చేరుకుంటున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.(శాకాహారమే తీసుకోవాలి: అదంతా ఫేక్‌!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు