రేపిస్టులు ఒట్టి అమాయకులు: గోవా మంత్రి

5 Jun, 2015 11:53 IST|Sakshi
రేపిస్టులు ఒట్టి అమాయకులు: గోవా మంత్రి

పణాజి: 'గ్యాంగ్ రేప్ లు ఎక్కడ జరగడంలేదు చెప్పండి. ఇదిగో.. ఇద్దరు మహిళల్ని రేప్ చేసిన  నిందితులున్నారే.. పాపం ఒట్టి అమాయకులు. నా దృష్టిలో ఇలాంటివి చాలా చిన్న సంఘటనలు. ఇలాంటి ఘటనలవల్ల  మా ప్రాంతానికి, ఇక్కడ జరిగే వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు'.. ఇవీ బాధ్యత వహించిన గోవా పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ తాజా వ్యాఖ్యలు. ఢిల్లీకి చెందిన ఇద్దరు మహిళలపై ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటనపై గురువారం రాత్రి మీడియాతో మాట్లాడుతు ఆయన ఈ విధంగా స్పందించారు.

గోవా పర్యటనకు వచ్చిన ఇద్దరు ఢిల్లీ మహిళల్ని సోమవారం రాత్రి ఐదుగురు యువకులు బెదిరించి.. అరుణ గ్రామంలోని ఓ భవంతిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని గంటల తర్వాత  గస్తీ పోలీసు బృందం వారిని కాపాడింది. బాధితురాళ్లు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రిగారు ఈ విధమైన కాంమెంట్లు చేయడంపై దుమారం చెలరేగింది. గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఉర్ఫాన్ ముల్లా మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రభుత్వం తీరువల్లే గోవాలో నేరాలు పెట్రేగిపోతున్నాయని విమర్శించారు.

రెండేళ్ల కిందట పణాజిలో ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లో మాదక ద్రవ్యాలతో పట్టుబడిన యువకుడి ఉదంతంలోనూ మంత్రిగారు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గోవా లాంటి పర్యాటక ప్రాంతంలో మద్యం, మాదక ద్రవ్యాలను వినియోగించడం మామూలేనని, అవి లేకుంటే టూర్ ను ఆస్వాదించలేమని, ఇందుకు నిర్వాహకులను తప్పుపట్టాల్సిన పనిలేదన్నారు.

మరిన్ని వార్తలు