లాక్‌డౌన్‌ : గోవా కీలక నిర్ణయం

12 May, 2020 11:28 IST|Sakshi

పర్యాటకులను ఆహ్వానించేందుకు సిద్ధం

మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చేవారికి అనుమతి లేదు

పనాజి: కరోనా సంక్షోభంతో తన ప్రధాన ఆదాయ  వనరు అయిన పర్యాటక ఆదాయం క్షీణించి ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిన గోవా ప్రభుత్వం కీలక  నిర్ణయాన్ని ప్రకటించింది. పర్యాటకులను ఆహ్వానించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తాజాగా ప్రకటించారు. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ సందర‍్భంగా పర్యాటక రంగాన్ని రక్షించు కోవాలని, టూరిజం అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరిన నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని గోవా ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం గ్రీన్ జోన్‌గా వున్న గోవాలో  ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అందుకే  ప్రత్యేక నిబంధనలు, పరిమితులతో పర్యాటకుల్ని ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.  

పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు రాష్ట్రం తన స్వంత మార్గదర్శకాలు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను రూపొందిస్తోందని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ సంక్షోభంతరువాత పర్యాటకులను ఆకర్షించడానికి కేంద్రంతోపాటు రాష్ట్రం కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుందనీ అందుకు తాము సిద్ధమని ఆయన చెప్పారు. అయితే సరిహద్దుల్లో అటూ ఇటూ ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి మాత్రం పర్యాటకులకు అనుమతి  లేదని స్పష్టం చేశారు. 

మే 17 తర్వాత కేంద్రం ప్రకటించే మార్గదర్శకాలకనుగుణంగా తమ ప్రభుత్వ విధివిధానాలతో పర్యాటకుల్ని అనుమతిస్తామని గోవా సీఎం తెలిపారు. లాక్‌డౌన్‌​3.0 తరువాత కొన్ని పరిమితులతో బస్సు , రైలు , విమానాల ద్వారా అంతర్-రాష్ట్ర మార్గాల్లో  ప్రయాణాలను అనుమతించాలన్నారు.  రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా తిరిగి రూపొందించే పనిలో ఉంది.   (లాక్‌డౌన్‌ : మూడు గంటల్లో రూ.10 కోట్లు)

కరోనా వైరస్‌, లాక్‌డౌన్  పాతాళానికి పడిపోయిన పర్యాటక ఆదాయాన్ని తిరిగి సాధించేందుకు పరిమాణాత్మక విధానానికి బదులుగా గుణాత్మక ఆచరణపై దృష్టి సారించినట్టు  సీఎం సావంత్ చెప్పారు. కాగా ప్రధానితో తన సంభాషణ సందర్భంగా, రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించాలని సావంత్ మోదీని కోరిన సంగతి  విదితమే. (రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే!)

మరిన్ని వార్తలు