రాహుల్‌, మోదీలకు ఓ సర్పంచ్‌ సవాల్‌

6 Jul, 2018 20:48 IST|Sakshi
సర్పంచ్‌ సిద్దేశ్‌ భాగత్‌

ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ తరహాలో అగ్రికల్చర్‌ చాలెంజ్‌

గోవా : సోషల్‌ మీడియా వేదికగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ తీసుకొచ్చిన ఫిట్‌నెస్‌ చాలెంజ్‌కు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. అటు ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఈ చాలెంజ్‌ను స్వీకరించి ఫిట్‌నెస్‌పై విస్తృత ప్రచారం కల్పించారు. అయితే ఈ తరహాలోనే గోవాలోని ఓ గ్రామ సర్పంచ్‌ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలకు ‘అగ్రికల్చర్‌ చాలెంజ్‌’  అని సవాల్‌ విసిరి వార్తల్లో నిలిచాడు.

దక్షిణ గోవాలోని అకెమ్‌ బయిసో గ్రామ పంచాయతీ సర్పంచ్‌ సిద్దేశ్‌ భాగత్‌ మంత్రులు, క్రీడాకారులు, వీఐపీలు.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన రైతు కన్నా తక్కువే అని తెలిపాడు. ప్రతి ఒక్కరు పొలంలోకి దిగి.. ట్రాక్టర్‌తో పొలం దున్ని.. విత్తనాలు వేస్తే రైతు పడే కష్టం ఎంటో తెలుస్తోందన్నాడు. ఇదేదో తన పాపులారిటీ కోసం చేయడం లేదని, రైతు కష్టం ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకే ఈ చాలెంజ్‌ తీసుకొచ్చినట్లు స్పష్టం చేశాడు. తన దృష్టిలో మంత్రులు, ఎమ్మెల్యేలు వీఐపీలే కాదని, దేశానికి అన్నం పెట్టే రైతన్ననే వీఐపీ అని చెప్పుకొచ్చాడు. తన చాలెంజ్‌ను మోదీ, రాహుల్‌తో పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు స్వీకరించాలన్నాడు.

సవాల్‌ను ‍స్వీకరించిన గోవా ప్రజాప్రతినిధులు
ఈ సర్పంచ్ విసిరిన సవాల్‌కు అనేక మంది మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఛాలెంజ్‌ను ఇప్పటికే గోవాలోని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వీకరించి పొలాల్లోకి దిగుతున్నారు. ఈ సర్పంచ్‌ సవాల్‌ను తొలుత దక్షిణ గోవా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో స్వీకరించారు. ఆయన ట్రాక్టర్‌తో వరి నాట్ల కోసం పొలాన్ని సిద్దం చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. రెవిన్యూ శాఖ మంత్రి రోహన్‌ కాంటే సైతం ఈ చాలెంజ్‌ను స్వీకరించి తన వ్యవసాయ భూమిలో పొలాన్ని సిద్దం చేశాడు. 

మరోవైపు గోవా వ్యవసాయశాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ కూడా తన నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో నాట్లు వేశారు. అయితే, ఈ చాలెంజ్‌ను మాత్రం ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలోని బంజరు భూములను సాగులోకి తేవడమే నిజమైన అగ్రికల్చర్ ఛాలెంజ్ అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ యంత్రాంగం చాలా ముఖ్యమైందని, అందుకే తమ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం కింద ఎకరాకు రూ.19,500 అందజేస్తుందని తెలిపారు. పడించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతులు ఆందోళన బాటపట్టడంతో ఈ చాలెంజ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సైతం పంటలకు మద్దతు ధర పెంచుతూ రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు