విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడి సాహసం

25 Sep, 2018 11:09 IST|Sakshi

పాట్నా : తొలిసారి ఎక్కడికైనా వెళ్లినా, ఏదైనా పని ప్రారంభించిన, ఏదైనా వస్తువును కొన్నా కాస్తా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే తొలిసారి విమానయానం చేసేవారు అంటే ఈ కంగారు మరి కాస్తా ఎక్కువే. ఎందుకంటే విమానాలను దగ్గర నుంచి చూడ్డమే చాలా అరుదు. అలాంటప్పుడు ఇక వాటి గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉండదు. దాంతో తొలిసారి విమానయానం చేసేటప్పుడు సహజంగా కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. ఇలాంటి పొరపాటు సంఘటనే ఒకటి ఢిల్లీ నుండి పట్నా వెళ్తున్న గోఎయిర్ విమానంలో చోటు చేసుకుంది.

రాజస్థాన్‌ అజ్మీర్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి తొలిసారిగా విమానం ఎక్కాడు. ఈ క్రమంలో.. నిబంధనలు సరిగ్గా అర్థం కాకపోవడంతో తాను ఇబ్బంది పడ్డమే కాక ప్రయాణికులను కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. సదరు ప్రయాణికుడు విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎగ్జిట్ డోర్ వద్దకు వెళ్లి దానిని లాగడానికి ప్రయత్నించాడు. విస్తుపోయిన ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో.. సిబ్బంది వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం విమానం పాట్నా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే.. అతన్ని పోలీసులకు అప్పగించారు. అయితే అతడు చెప్పిన సమాధానం విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఈ విషయం గురించి సదరు ప్రయాణికుడు తనకు విమాన ప్రయాణం కొత్త అని.. తాను విమానం ఎక్కడం ఇదే తొలిసారని.. అందువల్లే వాష్ రూమ్ డోర్‌కి, ఎగ్జిట్ తలుపుకి తేడా తెలుసుకోలేకపోయానని తెలిపాడు. ఫలితంగా ఈ పొరపాటు జరిగిందని వివరించాడు. దాంతో పోలీసులు తెలియక చేసిన తప్పుగా భావించి సదరు వ్యక్తిని విడిచిపెట్టారు. విమాన సిబ్బంది కూడా అనుకోని ఈ పరిణామానికి తొలుత కొంత భయపడినా.. ఆ తర్వాత విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.

ఆ వ్యక్తి గనుక బలవంతంగా ఎగ్జిట్ డోర్ తెరిచి ఉంటే.. అనుకోని ప్రమాదం సంభవించి ఉండేదని సిబ్బంది తెలిపారు. జరిగిన సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా గోఎయిర్ యాజమాన్యం తమ సిబ్బందిని ఆదేశించింది. అంతేకాక నిబంధనల గురించి ప్రయాణిలకు సరైన రీతిలో అర్థం అయ్యేలా చెప్పాలని  తెలిపింది. గతంలో కూడా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. రాంచీలోని బ్రిసా ముందా విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అవుతుందనగా ఓ ప్రయాణికుడు ఎగ్జిట్‌ డోర్ తీసి అందరినీ బెంబేలెత్తించాడు. విమానాశ్రయంలో దిగి ఎయిర్‌ఏసియా విమానం రన్‌వేపైకి వస్తుండగా ప్రయాణికుడు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల ఆ ఘటన జరిగింది.

మరిన్ని వార్తలు