‘గోధ్రా’ దోషులకు శిక్ష తగ్గింపు

10 Oct, 2017 07:24 IST|Sakshi

11 మందికి మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్పు

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారమివ్వండి

గుజరాత్‌ హైకోర్టు తీర్పు

అహ్మదాబాద్‌/న్యూఢిల్లీ: గోధ్రా రైలు దగ్ధం కేసులో దోషులకు శిక్ష తగ్గిస్తూ గుజరాత్‌ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరణ శిక్ష పడిన 11 మంది దోషులకు ఆ శిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పునిచ్చింది. అలాగే జీవిత ఖైదు పడిన మరో 20 మందికి అదే శిక్షను ఖరారు చేసింది. ఆ ఘటన సమయంలో శాంతి భద్రతలను సరిగా పరిరక్షించలేకపోయారంటూ రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ గోధ్రా ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం అందజేయాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అనంత్‌ ఎస్‌ డేవ్, జస్టిస్‌ జీఆర్‌ ఉద్వానీ ఆదేశాలు జారీ చేశారు. 

గోధ్రా స్టేషన్‌లో 59 మంది మృతి: 2002, ఫిబ్రవరి 27న సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అయోధ్య నుంచి వస్తున్న ప్రయాణికులపై కొందరు ఆందోళనకారులు గోధ్రా స్టేషన్‌లో దాడిచేశారు. ఎస్‌–6 కోచ్‌కు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది మృతిచెందారు. వీరిలో చాలా మంది కరసేవకులు ఉన్నారు. ఈ ఘటన అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో సుమారు 1,200 మంది మరణించారు. ఈ మారణహోమంపై విచారణ జరిపేందుకు అప్పటి గుజరాత్‌ ప్రభుత్వం జస్టిస్‌ నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. గోధ్రా ఘటన వెనుక కుట్ర దాగి ఉందని విచారణలో కమిషన్‌ తేల్చింది. 

31 మంది దోషులు.. 63 మంది నిర్దోషులు
గోధ్రా రైలు దహనం కేసులో 2011, మార్చి 1న ప్రత్యేక సిట్‌ న్యాయస్థానం 31 మందిని దోషులుగా పేర్కొంటూ అందులో 11 మందికి మరణ శిక్ష మరో 20 మంది జీవిత ఖైదును ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. 63 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంది. వారిలో ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొన్న మౌలానా ఉమర్జీ, గోధ్రా మున్సిపాలిటీ అధ్యక్షుడు మొహమ్మద్‌ కలోటా, మొహమ్మద్‌ అన్సారీ, నానుమియా చౌదరి ఉన్నారు. కాగా, సిట్‌ కోర్టు తీర్పుపై ఉరిశిక్ష పడిన 11 మంది దోషులు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు 63 మందిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం కూడా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. 

తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలి..
11 మంది దోషుల మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దీపావళిలోగా సుప్రీంకోర్టును ఆశ్రయిం చాల్సిందిగా గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వ హిందూ పరిషత్‌ చీఫ్‌ ప్రవీణ్‌ తొగాడియా సూచించారు. పక్కా ప్రణాళికతో కుట్రపూరితంగా హిందువులను చంపిన ఆ జిహాదీలకు ఉరి శిక్ష ఎందుకు విధించకూడదంటూ ఆయన ప్రశ్నించారు. హిందువులకు కనీస న్యాయం కూడా జరగడం లేదని తొగాడియా ఆరోపించారు.  

గోధ్రా కేసు తీరుతెన్నులు
- 2002, ఫిబ్రవరి 27: అయోధ్య నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు గోధ్రా స్టేషన్‌లో నిప్పుపెట్టిన అగంతకులు. అగ్నికి ఆహుతైన 59 మంది కరసేవకులు. 
మార్చిలో ఈ ఘటనతో ప్రమేయమున్న రాజకీయ నాయకులు హజీబలాల్, మహ్మద్‌ హుస్సేన్‌ కొలాట, పలువురు స్థానిక వ్యాపారులతో సహా 50 మందికిపైగా  అరెస్టు. 
మే 24న 54 మందిపై చార్జిషీటు దాఖలు. మే 27న సీనియర్‌ పోలీసు అధికారి రాఖేష్‌ ఆస్థానా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు. 
జూలై 9న స్థానిక టీ కొట్టు యజమాని స్టేట్‌మెంట్‌కు అనుగుణంగా స్థానిక వ్యాపారి రజాక్‌ కుర్కుర్‌ ›ప్రధాన సూత్రధారిగా సింగ్లా ఫాలియాకు చెందిన ముస్లింల బృందం ఎస్‌–6 బోగీకి నిప్పుపెట్టినట్లు (140 లీటర్ల పెట్రోలు పోసి) ఎఫ్‌ఐఆర్‌ నమోదు. 
2004, మార్చి 18న అనుమానితులపై ‘పోటా’ విధింపు. 
2005, మేలో సబర్మతి జైలులో 134 మంది అనుమానితులపై ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభం. 
2011 ఫిబ్రవరిలో 11 మందికి మరణశిక్ష, 20 మంది యావజ్జీవ ఖైదును విధించడంతో పాటు 63 మందిని (ప్రధాన నిందితుడు మౌలానా ఉమర్జీ సహా) నిర్దోషులుగా తీర్పు వెలువడింది. 
2017 అక్టోబర్‌ 9న గుజరాత్‌ హైకోర్టు కిందికోర్టు ఉత్తర్వులకు స్వల్ప మార్పులు.11 మందికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా కుదింపు. 
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

మరిన్ని వార్తలు