20 కిలోల బంగారం.. 200 కి.మీ. యాత్ర

1 Aug, 2018 11:38 IST|Sakshi

హరిద్వార్‌ : ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి గోల్డెన్‌ బాబాగా పేరొందిన సుధీర్‌ మక్కర్‌ ప్రతి ఏటా హరిద్వార్‌ నుంచి ఢిల్లీ వరకూ సాగే కన్వర్‌ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. 20 కిలోల బంగారు ఆభరణాలను ధరించే గోల్డెన్‌ బాబా ఈ ఏడాది సాగే 25వ కన్వర్‌ యాత్రలోనూ పాల్గొంటున్నారు. యాత్రలో పాల్గొనే ముందు  బాబా కాషాయ దుస్తుల్లో, భారీ జ్యూవెలరీతో ఉత్తరాఖండ్‌లో మెరిశారు. 200 కిలోమీటర్లు యాత్ర ఆద్యంతం ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగనున్నారు.బంగారు ఆభరణాలను ప్రదర్శించాలనే మోజు తనకు లేదని, సిరిసంపదలకు నిలయమైన లక్ష్మీ దేవతకు ప్రతీకగానే తాను వీటిని ధరిస్తుంటానని ఆయన చెబుతుంటారు.

వ్యాపారవేత్త నుంచి స్వామీజీగా మారిన సుధీర్‌ 25వ కన్వర్‌ యాత్రే తాను పాల్గొనే చివరి యాత్ర కావచ్చని చెప్పుకొచ్చారు. ఈసారి యాత్రలో తాను ఎక్కువ బంగారు ఆభరణాలను ధరించనని, వాటి బరువు కారణంగా తన మెడనరాలు దెబ్బతింటున్నాయని, ఓ కంటి చూపు కూడా మందగించిందని తెలిపారు. కొత్త బంగారు చైన్‌ రెండు కిలోలుండగా, శివ లాకెట్‌ కూడా బరువైనదేనని చెప్పారు.

ఇక గోల్డెన్‌ బాబా యాత్రలో ఉండగా ఆయన బంగారం భద్రంగా ఉండేందుకు భారీ సెక్యూరిటీ నిత్యం ఆయనను అనుసరిస్తుంది. ఇక బాబా సైతం బయటి ఆహార పదార్థాలను తీసుకోకుండా తనతో పాటు వచ్చే తన వ్యక్తిగత ప్యాంట్రీలో తయారయ్యే ఆహారాన్నే తీసుకుంటారు.ఈ బాబాకు ఓ బీఎండబ్ల్యూ, రోలెక్స్‌ వాచ్‌, రూ 150 కోట్ల విలువైన ఆస్తులున్నాయని గతంలో వార్తలు వచ్చాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు