20 కిలోల ‘బంగారు’బాబా

2 Aug, 2018 03:22 IST|Sakshi

హరిద్వార్‌: బంగారం ధరించి తీర్థయాత్రలు చేసే సాధువు మరోసారి వార్తల్లో నిలిచారు. గోల్డెన్‌ బాబాగా పేరొందిన సుధీర్‌ మక్కర్‌ సుమారు 20 కిలోల బరువైన బంగారు ఆభరణాలు ధరించి హరిద్వార్‌లో జరుగుతున్న కన్వార్‌ యాత్రలో పాల్గొంటున్నారు. ఇది ఆయనకి 25వ యాత్ర కావడం విశేషం. గతంలోనూ కన్వార్‌ యాత్రలో మక్కర్‌ సుమారు రూ.4 కోట్ల విలువచేసే 12–13 కిలోల బంగారం, చేతికి రూ.27 లక్షల రోలెక్స్‌ గడియారం ధరించి సంచలనం సృష్టించారు.

ఏటా ఆయన ఒంటి మీది బంగారం పెరుగుతూ ఉంది. గతేడాది 14.5 కిలోల బంగారు ఆభరణాలు ధరించగా, ఈ ఏడాది రూ.6 కోట్ల విలువైన 20 కిలోల ఆభరణాలతో యాత్రలో పాల్గొంటున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో మక్కర్‌ తన ఖరీదైన వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 2016 జనవరిలో జరిగిన అర్ధకుంభమేళాలో ఆయన్ని చూడటానికి సాటి యాత్రికులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఆయనకు ఎల్లవేళలా ఇద్దరు పోలీసులు కాపలా కాస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లినా అక్కడి ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది.

మరిన్ని వార్తలు