జైలు కాదు.. బెయిలు

9 May, 2015 02:10 IST|Sakshi
ముంబైలో అభిమానులను బాల్కనీ నుంచి తల్లిదండ్రలకు చూపిస్తున్న సల్మాన్

సల్మాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట  కిందికోర్టు విధించిన ఐదేళ్ల శిక్ష నిలుపుదల
 

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు పెద్ద ఊరట! ‘హిట్ అండ్ రన్’ కేసులో పదమూడేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కిందికోర్టు విధించిన ఐదేళ్ల శిక్షను బాంబే హైకోర్టు నిలిపివేసింది. ఆయనకు బెయిల్ ఇస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. కింది కోర్టులో రూ.30 వేల పూచీకత్తు సమర్పించాలని, విదేశాలకు వెళ్లేముందు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలని సల్మాన్‌ను ఆదేశించింది. కిందికోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ సల్మాన్ దాఖలు చేసిన అప్పీలుపై విచారణను వేగవంతం చేస్తామని తెలిపింది. అనంతరం కేసు తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది. బుధవారం కిందికోర్టు తీర్పు వెలువరించిన రోజే సల్మాన్ హైకోర్టును ఆశ్రయించడంతో.. న్యాయస్థానం రెండ్రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వడం తెలిసిందే. శుక్రవారం బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో జస్టిస్ అభయ్ థిప్సే... సల్మాన్ అప్పీలుపై విచారణ చేపట్టారు.

‘‘సల్మాన్ అప్పీలుపై నిర్ణయం తీసుకునేంత వరకు ఆయన్ను జైల్లో ఉంచాల్సిన కేసు కాదిది. అప్పీలు పిటిషన్‌ను అనుమతించి పెండింగ్‌లో ఉంచిన తర్వాత.. ఆయన హక్కులకు భంగం కలిగించడం ఎందుకు? చాలా కేసుల్లో హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించేవరకు నిందితులను జైల్లోనే ఉంచుతున్నారు’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘‘దోషికి కిందికోర్టు ఏడేళ్ల లోపు కారాగార శిక్ష విధించి, పైకోర్టు అప్పీలును అనుమతించిన పక్షంలో.. ఆ శిక్షను నిలుపుదల చేసేందుకు వీలు కల్పించే నిబంధన ఉంది కదా? దాన్ని మీరెందుకు విస్మరిస్తున్నారు?’’ అని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులను జడ్జి ప్రశ్నించారు. కేసు విచారణ సాగుతున్నంత కాలం సల్మాన్ బెయిల్‌పైనే ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రమాదం సమయంలో సల్మాన్ కారు నడుపుతున్నారా లేదా అన్న విషయంపై అనేక వాదనలున్నాయన్నారు. బెయిల్ ఇచ్చినంత మాత్రాన సల్మాన్ ఎక్కడికీ పారిపోడన్నారు.

కిందికోర్టు మా వాదన  పట్టించుకోలేదు: సల్మాన్ లాయర్
కిందికోర్టు తమ వాదన పట్టించుకోలేదని సల్మాన్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ వాదించారు. ప్రమాదం సమయంలో కారులో నలుగురున్నారని, కారును డ్రైవర్ అశోక్‌సింగ్ నడుపుతున్నాడని వివరించారు. ఈ కేసులో రవీంద్ర పాటిల్(సల్మాన్ బాడీగార్డు)పై ఒత్తిడి తెచ్చి సల్మానే కారు నడిపినట్లుగా ప్రాసిక్యూషన్ సాక్ష్యం ఇప్పించిందని ఆరోపించారు. టైరు పేలిపోవడంతోనే ప్రమాదం జరిగిందన్న వాదనను కూడా కిందికోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

ప్రమాదం సమయంలో కారులోనే ఉన్న గాయకుడు కమాల్ ఖాన్‌ను ప్రాసిక్యూషన్ ఎందుకు ప్రశ్నించలేద న్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది సందీప్ షిండే.. సల్మాన్ అప్పీలును విచారణకు స్వీకరించడాన్ని వ్యతిరేకించపోయినా ఆయనకు విధించిన శిక్షను నిలిపివేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేసు విచారణ తుది దశకు వస్తున్న దశలో కారును అశోక్‌సింగ్ నడుపుతున్నారన్న కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారన్నారు.

సల్మాన్ ఇంటి వద్ద అభిమానుల సంబరాలు
సల్మాన్‌కు బెయిల్ సంగతి తెలియగానే బాంద్రాలోని ఆయన ఇంటి వద్ద అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. పెద్దఎత్తున అభిమానులు చేరుకోవడంతో వారిని నియంత్రించేందుకు ముందుగానే పోలీసులను మోహరించారు. శిక్షపై స్టేతోపాటు బెయిల్ సంగతి తెలియగానే సల్మాన్ కూడా ఉల్లాసంగా కనిపించారు. అభిమానులకు సంతోషంగా అభివాదం చేస్తూ కిందికోర్టులో పూచీకత్తు సమర్పించేందుకు వెళ్లారు.

అందరికీ కృతజ్ఞతలు: సల్మాన్
కష్టకాలంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు, బాలీవుడ్ తారలందరికీ సల్మాన్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘నా కోసం ప్రార్థనలు జరిపిన వారికి, మద్దతుగా నిలిచిన వారికి మెహర్బానీ, షుక్రియా’’ అంటూ ట్వీట్ చేశాడు. హిట్ అండ్ రన్ కేసులో జైలు శిక్ష పడి.. శుక్రవారం బాంబే హైకోర్టు స్టే ఇచ్చిన తరువాత సల్మాన్ మొదటి సారి స్పందించాడు.
 
‘అభిజిత్, ఫరాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి’
ముజఫర్‌పూర్(బీహార్): బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య, డిజైనర్ ఫరాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కాజీ మహ్మద్‌పూర్ పోలీసులను స్థానిక జిల్లా కోర్డు శుక్రవారం ఆదేశించింది. సల్మాన్‌ఖాన్ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి ఫుట్‌పాత్‌లపై నిద్రించే వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు పైవిధంగా స్పందించింది. పత్రికలు, టీవీ చానల్స్‌లో ఫుట్‌పాత్‌లపై నిద్రించే వారి గురించి అభిజిత్, ఫరా చేసిన వివాదాస్పద, చౌకబారు వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించాలని అడ్వొకేట్ సుధీర్ కుమార్ ఓజా కోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఇరువురిపై ఐపీసీ సెక్షన్ 153, 153-ఏ, 504, 506ల కింద కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అయితే ట్విటర్‌లో తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో క్షమాపణ చెబుతున్నట్లు ఫరా ప్రకటించారు. ఎవరినీ కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని పేర్కొంది.

మరిన్ని వార్తలు