-

‘కీ’ కోసం రైలు ఆగిపోయింది

17 May, 2018 19:29 IST|Sakshi
ఆగిపోయిన గూడ్స్‌ రైలు

రివారి : రాకపోకలు రద్దీగా ఉన్నాయనో, వాతావవరణం అనుకూలించడం లేదనో రైళ్లు నిలిచిపోవడం చూస్తుంటాం. కానీ తాళం చెవి మిస్‌ కావడంతో, ఓ గూడ్స్‌ రైలు గంటల పాటు రైల్వే స్టేషన్‌లోనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మథుర నుంచి రివారికి వెళ్తున్న బొగ్గుతో నిండిన ఓ రైలు గుర్గావ్‌కు దగ్గరిలో బవల్‌ స్టేషన్‌లో దాదాపు ఎనిమిది గంటలకు పైగా ఆగిపోయింది. ఈ గూడ్స్‌ రైలును నడుపుతున్న సిబ్బంది స్విఫ్ట్‌లు మారే క్రమంలో రైలుకు సంబంధించిన తాళం చెవి మిస్‌ కావడంతో ఇలా వేచిచూడాల్సి వచ్చింది. దీంతో భారీ మొత్తంలో ట్రాఫిక్‌ జామ్‌ఏర్పడి, వేరే మార్గాల్లో రైళ్లు ప్రయాణించాల్సి వచ్చింది. 

మథురలో ప్రారంభమైన ఈ రైలు, రివారికి చేరుకోవాల్సి ఉంది. మార్గం మధ్యలో డ్రైవర్‌, గార్డులు మారతారు. రైలును స్టేషన్‌లో ఆపిన తర్వాత కొత్త సిబ్బంది ఛార్జ్‌ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త సిబ్బంది స్విఫ్ట్‌ను తీసుకునే సమయంలో స్టేషన్‌ మాస్టర్‌ కీస్‌ అడిగాడు. ముందు స్విఫ్ట్‌లో ఉన్న సిబ్బంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కావడంతో, తెలియక వారు తాళం చెవి ఇవ్వకుండా వెళ్లిపోయారు. అంతేకాక వారు మొబైల్‌ నెంబర్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించి, జైపూర్‌ నుంచి కొత్త తాళం చెవిని తెప్పించేంత వరకు రైలును కదలలేదు. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు ఎనిమిది గంటలకు పైగా సమయం పట్టింది.

మరిన్ని వార్తలు