జీమెయిల్‌.. న్యూలుక్‌

26 Apr, 2018 02:14 IST|Sakshi

వినియోగదారుల భద్రత, గోప్యత కోసం 14 కొత్త ఫీచర్లు తెచ్చిన గూగుల్‌

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ జీమెయిల్‌లో కొత్తగా 14 ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల సమాచారానికి మరింత భద్రత కల్పించడంతో పాటు గోప్యతను పెంపొందించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు దశలవారీగా ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

1. డౌన్‌లోడ్, ప్రింట్‌ చేయకుండా బ్లాక్‌ 
వ్యాపార సంస్థల గోప్యతను పరిరక్షించేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాము పంపిన ఈ–మెయిల్‌ను అవతలివారు డౌన్‌లోడ్, ఫార్వర్డ్, కాపీ చేయకుండా, ప్రింట్‌ తీసుకోకుండా బ్లాక్‌ చేసే సదుపాయం కల్పించింది. 

2. కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌ 
నిర్ణీత గడువు తర్వాత ఈ–మెయిల్స్‌ డెలిట్‌ అయ్యే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ మోడ్‌లో అవతలివారికి ఈ–మెయిల్‌లో సమాచారం కాకుండా ఓ లింక్‌ మాత్రమే వెళుతుంది.దీనిపై క్లిక్‌ చేయగానే సమాచారం సాధారణ ఈ–మెయిల్‌లో ఉన్నట్లే కన్పిస్తుంది. 

3. రెండు దశల్లో ధ్రువీకరణ 
అవతలి వ్యక్తి పంపిన ఈ–మెయిల్‌ను చూసేందుకు రెండు దశల్లో ఉండే ధ్రువీకరణను తీసుకొచ్చింది. ఈ–మెయిల్‌ అందుకున్న వ్యక్తి దాంట్లోని సమాచారాన్ని చూసేందుకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా వచ్చే పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి.  

4. ముఖ్యమైన మెయిల్స్‌ కోసం స్నూజ్‌ 
వినియోగదారులు ముఖ్యమైన ఈ–మెయిల్స్‌కు జవాబివ్వడం మర్చిపోకుండా ఈ ఫీచర్‌ను తెచ్చింది. ముఖ్యమైన ఈ–మెయిల్స్‌ ఇన్‌బాక్స్‌లో అన్నింటికంటే పైన కన్పించేలా ఈ ఫీచర్‌ ఉపకరిస్తుందని వెల్లడించింది. 

5. ఆఫ్‌లైన్‌లోనూ వాడుకోవచ్చు 
ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందుబాటులో ఉండని సందర్భాల్లో సైతం జీ–మెయిల్‌ను వాడుకునేలా ఆఫ్‌లైన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. నెట్‌ ఉన్నప్పుడు జీమెయిల్‌కు వచ్చిన సమాచారం ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అయిపోతుంది. 

6. చెక్‌చేయని మెయిల్స్‌ కోసం అలర్ట్స్‌ 
రెండ్రోజులు దాటినా ఓపెన్‌ చేయని మెయిల్స్‌ను ఈ ఫీచర్‌ వినియోగదారుల దృష్టికి తీసుకెళుతుంది. ముఖ్యమైన ఈ–మెయిల్స్‌ను మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్‌ ద్వారా గుర్తిస్తామంది. యూజర్లు అందుకున్న ఈ–మెయిల్స్‌లో ఏవైనా ప్రశ్నలుంటే వెంటనే వారి దృష్టికి తీసుకెళ్తామంది. 

7.తెరవకుండానే అటాచ్‌మెంట్లు చూసేలా 
మెయిల్స్‌ను ఓపెన్‌ చేయకుండానే వాటితో వచ్చిన అటాచ్‌మెంట్లను చూసే ఫీచర్‌ తెచ్చిం ది. ఈ ఫీచర్‌లో అటాచ్‌మెంట్లు ఈ–మెయిల్‌ కింద కన్పించే ఐకాన్‌పై క్లిక్‌ చేసి చూడొచ్చు. 

8. హై ప్రయారిటీ నోటిఫికేషన్లు 
ఈ ఫీచర్‌ ద్వారా ఇన్‌బాక్స్‌లో చేరే అనవసరమైన ఈ–మెయిల్స్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యమైన, అత్యవసరమైన ఈ–మెయిల్సే ఇన్‌బాక్స్‌లో చేరుతాయి. దీనివల్ల 97% అనవసరమైన ఈ–మెయిల్స్‌ను నిలువరించవచ్చు. 

9.ఒక్క క్లిక్‌తో అన్‌–సబ్‌స్క్రైబ్‌ 
గూగుల్‌ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ద్వారా అవసరం లేదని ఈ–మెయిల్‌ నోటిఫికేషన్లను ఓకే క్లిక్‌తో అన్‌సబ్‌స్క్రైబ్‌ చేయవచ్చు. 

10.స్మార్ట్‌గా రిప్లై ఇవ్వొచ్చు 
ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని కంప్యూటర్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మెయిల్‌ అందుకున్న వ్యక్తులు సంక్షిప్తంగా తమ జవాబుల్ని పంపొ చ్చు. జీ–మెయిల్‌లో అప్పటికే ఉండే ఈ జవాబుల్ని కావాలనుకుంటే ఎడిట్‌ చేసుకోవచ్చు. 

11. జీమెయిల్‌లో స్లైడ్‌ ప్యానెల్‌ 
ఇతర యాప్‌లను వాడుకోవడానికి జీమెయిల్‌ నుంచి బయటకి వెళ్లకుండా కొత్తగా యాప్స్‌ ప్యానెల్‌ను తీసుకొచ్చింది. జీమెయిల్‌లో కుడివైపు కన్పించే ఈ ప్యానెల్‌లో క్యాలెండర్, టాస్క్స్‌ సహా పలు యాప్‌లను చేర్చారు. 

12. ఆకర్షణీయంగా కన్పించేలా 
సరికొత్త యూజర్‌ ఇంటర్‌ఫేజ్‌ సాయంతో జీమెయిల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతానికి వెబ్‌ వెర్షన్‌కు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. 

13. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లకు టాస్క్స్‌ 
ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ యూజర్లకు సరికొత్త గూగుల్‌ టాస్క్స్‌(జీమెయిల్, గూగుల్‌ మ్యాప్స్, యూట్యూబ్‌ తదితరాలు ఉండే) యాప్‌ను విడుదల చేసింది. 

14. పిషింగ్‌ హెచ్చరికలు స్పష్టంగా.. 
సైబర్‌ నేరగాళ్లు పంపే పిషింగ్‌ మెయిల్స్‌ను మరింత సమర్థవంతంగా గుర్తించి హెచ్చరించేలా కొత్త ఫీచర్‌ను గూగుల్‌ అందుబాటులోకి తెచ్చింది. పిషింగ్‌ తీవ్రతను బట్టి ఎరుపు, పసుపు, బూడిద రంగుల్లో ప్రమాదకర ఈ–మెయిల్స్‌ కన్పిస్తాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు