కేరళకు గూగుల్‌ భారీ సాయం..!

28 Aug, 2018 13:48 IST|Sakshi
కేరళ వరదలు

సాక్షి, న్యూఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు గూగుల్‌ భారీ సాయం ప్రకటించింది. రూ. 7 కోట్లు విరాళమిస్తున్నట్టు గూగుల్‌ ఇండియా ట్విటర్‌లో వెల్లడించింది. సంస్థ వితరణలో ఉద్యోగులు కూడా పాలుపంచుకున్నారని తెలిపింది. కాగా, గత శతాబ్ద కాలంలో కేరళ ఇంతటి భారీ ప్రకృతి విలయాన్ని చూడలేదు. 1924లో ముంచుకొచ్చిన వరద ముప్పు నుంచి తేరుకున్న దేవభూమి కేరళ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కాగా, ఈ నెల (ఆగస్టు) మెదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో జలాశయాలన్నీ నిండిపోవడంతో ఒకేసారి 34 ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. దీంతో రాష్ట్రం వరద ముంపునకు గురైంది. కేరళ వ్యాప్తంగా 400 పైగా జనం వరదల్లో చిక్కుకుని మరణించగా, వేలాదిమందిని సైన్యం, సహాయక బృందాలు కాపాడాయి.  

మరోవైపు, ఈ విపత్తు పక్కకున్న కర్ణాటకను కూడా తాకింది. వరదల కారణంగా కొడగు జిల్లా నీట మునిగి 17 మంది చనిపోయారు. కేరళను ఆదుకోవడానికి దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ఇప్పటికే ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయి. తాజాగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రపంచంలోని కేరళీయులు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చి కేరళను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ప్రకృతి విపత్తు కారణంగా కేరళ 21 వేల కోట్లు నష్టపోయిందని పలు విశ్లేషణలు చెప్తున్నాయి. 

మరిన్ని వార్తలు