400 రైల్వే స్టేషన్లలో ఉచితంగా 'వైఫై'

12 Sep, 2015 15:03 IST|Sakshi
400 రైల్వే స్టేషన్లలో ఉచితంగా 'వైఫై'

బెంగళూరు: దేశంలోని 400 రైల్వే స్టేషన్లలో మరో నాలుగు నెలల్లో  గూగుల్ ఉచితంగా 'వైఫై' సౌకర్యాన్ని కల్పించనుంది. భారతీయ రైల్వేల కొలాబరేషన్‌తో 'ప్రాజెక్ట్ నీలగిరి' పేరిట హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ఇక్కడి గూగుల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాలో అమలు చేస్తున్న 'గూగుల్ ఫైబర్ ప్రాజెక్ట్' ఎంతో ప్రజాధరణ పొందిందని, అలాంటి ప్రాజెక్టునే భారత రైల్వేలలో ప్రాజెక్ట్ నీలగిరి పేరిట అమలు చేయాలని భారతీయ రైల్వే, గూగుల్ మధ్య అవగాహన కుదురినట్టు ఆ వర్గాల ద్వారా తెల్సింది.

రైల్వే స్టేషన్లలో వైఫై ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ పొందే ప్రయాణికులకు తొలి 34 నిమిషాలపాటు హైస్పీడ్ యూక్సెస్ ఉంటుందని, ఆ తర్వాత స్పీడ్ తగ్గుతుందని గూగుల్ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ నెట్ సౌకర్యం 24 గంటలపాటు ఉచితంగానే కొనసాగుతుందని స్పష్టం చేశాయి. దేశంలో వైఫై సౌకర్యం కల్పించాల్సిన 400 రైల్వే స్టేసన్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత భారతీయ రైల్వేదే. నాలుగు నెలల్లో ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న డిజిటల్ ఇండియా స్కీమ్‌లో భాగంగా ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నారా, లేదా అన్నది, ప్రాజెక్టు కింద భారతీయ రైల్వే గూగుల్‌కు ప్యాకేజీ కింద ఎంత సొమ్ము చెల్లించేది తదితర వివరాలు వెలుగులోకి రాలేదు.

>
మరిన్ని వార్తలు