గూగుల్‌ కీలక నిర్ణయం

23 Jan, 2019 17:51 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సామాజిక మాధ్యమం గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో వచ్చే రాజకీయ ప్రకటనలపై పూర్తి పారదర్శకత పాటించనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇకపై ప్రకటనలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందివ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అలాగే ఆ ప్రకటనలను ఎవరు ఇచ్చారు? దీనికి వారు వెచ్చించిన ఖర్చు ఎంత? వంటి వివరాలను సైతం వెల్లడించనున్నట్లు తెలిపింది. ‘ఇండియా పొలిటికల్‌ యాడ్స్‌ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్‌’ పేరిట నూతన పాలసీని తీసుకువచ్చినట్లు వెల్లడించింది.

దీని ప్రకారం ప్రకటనదారులు ఇకపై తమ ప్రకటనలకు సంబంధించి భారతీయ ఎలక్షన్‌ కమిషన్‌ (ఈసీఐ) లేదా ఈసీఐ అధికారులు అనుమతినిస్తూ జారీ చేసిన సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే ప్రకటనదారుల గుర్తింపును ధ్రువీకరించిన తర్వాతనే రాజకీయ ప్రకటనలు ఇస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన వెరిఫికేషన్‌ ప్రక్రియను ఫిబ్రవరి 14 నుంచి మొదలుపెడతామని తెలిపింది. ఈ ప్రకటనలు మార్చి నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ప్రభావితం చేసేలా ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఐటీ చట్టంలో పలు సవరణలు సైతం చేసింది. దీంతో అప్రమత్తమైన సామాజిక మాధ్యమాలు.. ప్రకటనల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ట్విటర్, ఫేస్‌బుక్‌ ప్రకటనల విషయంలో నిబంధనలు విధించగా.. తాజాగా గూగుల్‌ కూడా ప్రకటనదారులకు నిబంధనలు విధించింది.

మరిన్ని వార్తలు