పోరుకు ‘సోషల్‌ మీడియా’ సై!

13 Jan, 2019 01:27 IST|Sakshi

సోషల్‌ మీడియా వేదికగా ప్రచారమయ్యే దేశ సమగ్రతకూ, సార్వభౌమత్వానికీ నష్టం చేకూర్చే విషయాలను నిరోధించేందుకు కేంద్రం విధిస్తున్న ఆంక్షలను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సోషల్‌ మీడియా దిగ్గజాలు సిద్ధమౌతున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌లలో ఉన్న చట్టవ్యతిరేక అంశాలను తొలగించేందుకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొన్ని విధివిధానాలను రూపొందించింది. ఈ నిబంధనలను బట్టి సామాజిక మాధ్యమాల్లో ఉన్న విషయం చట్టవ్యతిరేకమైనదని ప్రతిపాదించిన 24 గంటల్లోపే సోషల్‌ మీడియా నుంచి ఆ సమాచారాన్ని తొలగించాల్సి ఉంటుంది. తామంతా దేశ సమగ్రతపై నిబద్ధతతో ఉన్నామని, అయితే సోషల్‌ మీడియాను ప్రభుత్వం నియంత్రించాలని చూస్తే కంపెనీలు ఊరుకోవని అంతర్జాతీయ సోషల్‌ మీడియా కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియా నియంత్రణపై భారతప్రభుత్వ ఆంక్షలను చట్టపరంగా ఎదుర్కొనేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా వేదికలు పరిశీలించి, తమ అభ్యంతరాలను ఇన్‌ర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ముందుంచేందుకు సిద్ధమవుతున్నారు.  

నిఘా ఎందుకు? 
భారత దేశంలో 50 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ వాడుతున్నారు. దేశంలో 30 కోట్ల మంది ఫేస్‌బుక్‌ని వాడుతున్నారు. లక్షలాది మంది ప్రజలు మన దేశంలో ట్విట్టర్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెస్తోన్న కొత్త నిబంధనలు ఇంటర్‌నెట్‌ వినియోగదారుల ప్రతి కదలికపై నిఘాఉంచడం వల్ల అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరంగా మారుతుందని భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉన్న సమాజానికి నష్టం చేకూరుస్తున్న విషయాలను నియంత్రించడానికి ఇది సరైన మార్గం కాదనీ, ఈ విషయంలో భారత ప్రభుత్వ విధానాలు ‘‘గుడ్డిగానూ, అసమానంగానూ’’ఉన్నాయని, ఇది పౌరులపై మితిమీరిన నియంత్రణకూ, వ్యక్తుల భావప్రకటనా స్వేచ్ఛకూ విఘాతం కలిగిస్తుందని ఇంటర్నెట్‌ కంపెనీ దిగ్గజాలు భావిస్తున్నాయి.  

భావ ప్రకటనా స్వేచ్ఛకు ఏమీ కాదు.. 
అయితే సోషల్‌ మీడియాను సురక్షితంగా ఉంచడమే ఈ నిబంధనల లక్ష్యమని, ఇది భావప్రకటనా స్వేచ్ఛను నియంత్రించడానికో, లేక వారిపై తమ అభిప్రాయాలను రుద్దడానికో ఉద్దేశించింది కాదని ఐటీ మంత్రిత్వ శాఖ సహకార్యదర్శి ఎస్‌.గోపాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. అయితే ట్విట్టర్‌ మాత్రం ఐటీ శాఖ ఆంక్షలతోనూ, అభిప్రాయాలతో ఏకీభవిస్తోందని ఆ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. టెక్నాలజీ కంపెనీల మెడపై వేలాడుతున్న కత్తి సోషల్‌ మీడియాపై ఆంక్షలని, టెక్నాలజీ న్యాయనిపుణులు నిఖిల్‌ నరేంద్రన్‌ అభిప్రాయపడ్డారు. 

నియంత్రణలివీ.. 
సోషల్‌ మీడియా నియంత్రణలు అన్ని చోట్లా ఒకేరకంగా లేవు. సామాజిక మాధ్యమ కంపెనీలు స్థానికంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి, డేటాని జాగ్రత్తపరచాలని వియత్నాం కోరింది. అలాగే గోప్యసమాచారాన్ని పోలీసులకు అందుబాటులో ఉంచాలని ఆస్ట్రేలియా పార్లమెంటులో బిల్లు ఆమోదించడం ద్వారా సోషల్‌ మీడియా కంపెనీలపై ఒత్తిడితెచ్చారు. జర్మనీలో అయితే 24 గంటలలోపు చట్టవ్యతిరేక సమాచారాన్ని తొలగించడానికీ, లేదంటే జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి.

మరిన్ని వార్తలు