మహారాష్ట్రలో బీజేపీకి పెద్ద దిక్కు

4 Jun, 2014 03:01 IST|Sakshi
మహారాష్ట్రలో బీజేపీకి పెద్ద దిక్కు

న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా వారం కిందట తొలిసారి పగ్గాలు చేపట్టిన గోపీనాథ్ ముండే మహారాష్ట్రలో బీజేపీకి పెద్దదిక్కుగా ఉండేవారు. మహారాష్ర్ట రాజకీయాలను శాసించే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను సైతం కంగు తినిపించేలా తన వ్యూహచతురతతో 1995లో బీజేపీ-శివసేన కూట మిని ఆయన అధికారంలోకి తెచ్చారు. రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతమైన మరాఠ్వాడాలో ఓ నిరుపేద బీసీ కుటుం బంలో జన్మించారు. దివంగత బీజేపీ నేత వసంత్‌రావు భాగవత్ చొరవతో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు.
 
 సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉండే ప్రజానాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. మహారాష్ట్రలో ఆయనకున్న మాస్ ఇమేజి ఆ పార్టీలోని ఇతర కీలక నాయకులెవరికీ లేకపోవడం ముండేపై ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముండే డిప్యూటీ సీఎంగానూ పనిచేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి మహాకూటమిగా బరిలో నిలపడంలో ముండే కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లకుగానూ మహాకూటమి 42 సీట్లలో గెలుపొందింది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది సీఎం పగ్గాలు చేపట్టాలని ఆకాంక్షించారు. 2009లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ముండే.. గతనెల 26న మోడీ కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు పంచాయతీ రాజ్, మంచినీరు-పారిశుద్ధ్య శాఖల బాధ్యతలు కూడా తీసుకున్నారు.
 
 వ్యక్తిగత జీవితం: ముండే పూర్తిపేరు గోపీనాథ్ పాండురంగ్ ముండే. 1949 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని బీడ్ జిల్లా నత్రాలో జన్మించారు. తల్లిదండ్రులు లింబాబాయి, పాండురంగ్ ముండే. ముండే బీకాం, లా పట్టాలు పుచ్చుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైల్లో ఉన్నారు. ముండే ముగ్గురు కుమార్తెల్లో ఒకరైన పంకజ ఎమ్మెల్యే. ఆమె బీడ్ జిల్లా పర్లీ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో కుమార్తె ప్రతిమ డాక్టర్ కాగా, చిన్న కుమార్తె యశశ్రీ న్యాయవిద్య అభ్యసిస్తున్నారు.

మరిన్ని వార్తలు