గోరఖ్‌పూర్‌ ఘటన : కఫీల్‌ఖాన్‌కు బెయిల్‌

25 Apr, 2018 18:55 IST|Sakshi

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్‌పూర్‌ 63 మంది చిన్నారుల మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌కు అలాహాబాద్‌ హైకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బీఆర్‌డీ మెడికల్‌ కాలేజిలో ఆక్సిజన్‌ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ కొరత కారణంగానే  పిల్లలు మృతి చెందారన్న ఆరోపణలతో మెదడు వాపు వ్యాధి నివారణ (ఏఈఎస్) విభాగానికి అధిపతిగా ఉన్న కఫీల్‌ఖాన్‌ జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి పూర్తిగా విషమించడంతో ఏప్రిల్‌ 19న కఫీల్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా ఆసుపత్రికి తరలించారు. కఫీల్‌ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని  హైకోర్టు అతనికి బెయిల్‌ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.

కాగా తన భర్తకు బెయిల్‌ మంజూరైన సందర్భంగా కఫీల్‌ఖాన్‌ భార్య డాక్టర్‌ షబీస్తాన్‌​ఖాన్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తన భర్తకు జైల్లో ఉండగా గుండెపోటు వచ్చినా కూడా జైలు అధికారుల సరైన వైద్యం అందించలేకపోయారని, తన భర్త పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం తగిన సమయంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్లనే ఆసుపత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుందని, ప్రభుత్వ తప్పిదాన్ని తనపై మోపారని డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ కూడా ఆరోపించారు. గోరఖ్‌పూర్‌లో ఘటనను ప్రధాన ఆయుధం​గా చేసుకున్న ప్రతిపక్షాలు సీఎం యోగిపై తీవ్ర విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు