ఏడాదిలో 25 ప్రాంతాల పేర్లు మార్పు

12 Nov, 2018 03:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాలు, గ్రామాల పేర్లను మార్చేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ పేర్ల మార్పు ప్రతిపాదనల్లో పశ్చిమ బెంగాల్‌ కూడా ఒకటి. అయితే, పశ్చిమ బెంగాల్‌ పేరును ‘బంగ్లా’ గా మార్చాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇటీవల అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను అయోధ్యగా పేరు మారుస్తూ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంలో ఆంధ్రపదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా, ఒడిశాలోని భద్రక్‌ జిల్లా ఔటర్‌ వీలర్‌ను ఏపీజే అబ్దుల్‌ కలాం ఐలాండ్‌గా, కేరళలోని మలప్పుర జిల్లా అరిక్కోడ్‌ను అరీకోడ్‌గా, హరియాణాలోని జింద్‌ జిల్లా పిండారిని పందు–పిండారగా, నాగాలాండ్‌లోని కిఫిరె జిల్లా సాంఫూర్‌ని సాన్‌ఫూరెగా పేర్లు మార్చారు.  ఈ ప్రతిపాదనలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం హోంశాఖ అమలు చేస్తుంది. కాగా, అహ్మదాబాద్‌ను కర్ణావతిగా పేరు మార్చాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ వెల్లడించారు.  

ఫైజాబాద్‌పై మిశ్రమ స్పందన
ఫైజాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిర్ణయంపై స్థానికుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అవసరం లేకుండానే కేవలం రాజకీయ కారణాలతో పేరును మారుస్తున్నారని, దీని వల్ల చారిత్రక నగరానికి ఉన్న గుర్తింపు తెరమరుగవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ..అది అయోధ్య కీర్తిప్రతిష్టల్ని మరింత ఇనుమడింపజేస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు