ఎవరు టాపర్లో తెలుసుకోవచ్చు!

5 Sep, 2018 10:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ పౌరల సామాజిక మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ‘సోషల్‌ మీడియా కమ్యూనికేషన్‌ హబ్‌’ను సుప్రీం కోర్టు అభ్యంతరాల కారణంగా ఆగస్టు మూడవ తేదీన విరమించుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఎంతో మంది భారతీయుల సామాజిక ఖాతాలు ప్రభుత్వం నిఘా నేత్రంలో ఉన్నాయనే విషయం ఎందరికి తెలుసు? ఆ నిఘా నేత్రం పేరు ‘అడ్వాన్స్‌డ్‌ అప్లికేషన్‌ ఫర్‌ సోషల్‌ మీడియా అనలిటిక్స్‌ (ఏఏఎస్‌ఎంఏ)’. ఈ టూల్‌ను కేంద్రంలోని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ నిధులతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ‘ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’ 2013–2014లో రూపొందించింది.

ఈ ఆస్మా టూల్‌ను ఎలాంటి ప్రచారం కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం 2017, ఏప్రిల్‌ నెల నుంచి దేశంలోని 40 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలోగా మరో 75 ప్రభుత్వ సంస్థల్లో అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని వ్యూహాత్మక ప్రాజెక్టుగా, వ్యూహాత్మక పురోగతిని పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేశామని కేంద్రం పేర్కొన్నట్లు ‘ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’ తన 2016–2017 వార్షిక నివేదకలో పేర్కొంది. ఆస్మాపై కేంద్రంలోని మంత్రి, కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయని, ఈ టూల్‌ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీన్ని తమ అంతర్గత అవసరాల కోసం ఉపయోగిస్తున్న కొన్ని ఏజెన్సీలు లిఖిత పూర్వకంగా కూడా కేంద్రానికి తెలిపాయని ఆ నివేదికలో వెల్లడించింది. అయితే ఈ ఆస్మాను ఏ ప్రభుత్వ సంస్థలు వాడుతున్నాయో, ఎందుకోసం వాడుతున్నాయో, ఏ ఏజెన్సీలు లిఖితపూర్వకంగా సంతృప్తి వ్యక్తం చేశాయో మాత్రం వెల్లడించలేదు. అలాగే ఈ ఆస్మాను ఇంటెలిజెన్సీ, భద్రతా విభాగాలకే పరిమితం చేశాయా, లేదా ? అన్న విషయంలో కూడా స్పష్టత లేదు.

ఆస్మా గురించి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు దీన్ని ఇన్‌స్టాల్‌ చేసినట్లయితే 24 గంటలపాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఫ్లికర్, గూగుల్‌ తదితర సామాజిక మాధ్యమాలను ఉపయోగించే ఖాతాదారులు ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకునే సమాచారాన్ని విశ్లేషించవచ్చు. సోషల్‌ మీడియా ప్రొఫైళ్లను, వారి పోస్టులను వీక్షించవచ్చు. వారి పోస్టింగులను సానుకూలం లేదా ప్రతికూలం అంటూ వర్గీకరణ కూడా చేయవచ్చు. అంటే ఎవరు మంచి వారో, ఎవరు చెడ్డవారో విశ్లేషించవచ్చు. ఏ సోషల్‌ మీడియాలో ఎవరు టాపర్లో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలోని పోలీసు విభాగంలో నేరస్థులపై నిఘాను కొనసాగించేందుకు ఓ సోషల్‌ మీడియా హబ్‌ను ఏర్పాటు చేయాలంటూ ‘నేషనల్‌ పోలీసు మిషన్‌’ ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో ఈ ఆస్మాను పోలీసు విభాగాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు అనధికారికంగా తెల్సింది. ఎందుకంటే నేరస్థులెవరో, నేరస్థులు ఎవరుకాదో తెలుసుకోవడానికే కాకుండా ఎవరు నేర స్వభావులు ఎవరో ముందుగానే తెలుసుకొని వారిపై నిఘా కొనసాగించడం ద్వారా నేరం చేయకుండా వారిని నియంత్రించవచ్చన వాదన కూడా కొంత మంది పోలీసు అధికారుల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ టూల్‌ను సైనిక బలగాలు కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది.

నేరస్థుల కదలికలను తెలుసుకునేందుకు వారి ఫోన్లపై నిఘా పెట్టడమన్నది పోలీసు విభాగంలో ఎప్పటి నుంచో కొనసాగుతోందని, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అందరిపై నిఘా పెట్టడం మంచిది కాదని ఉత్తరప్రదేశ్‌లో పోలీసు డైరెక్టర్‌ జనరల్‌గా, సరిహద్దు భద్రతా దళానికి డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన ప్రకాష్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. నియంతృత్వ పాలనలో నిఘా అవసరమంటే ఆలోచించవచ్చని, స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించుకునే అవకాశం ఉన్న ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిఘా అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ సంస్థలు పౌరుల సోషల్‌ మీడియా డేటాను పెద్ద ఎత్తున సేకరిస్తూ విశ్లేషిస్తుందంటే అది కచ్చితంగా పౌరులపై నిఘా కొనసాగించడమేనని ‘గ్లోబల్‌ డిజిటల్‌ రైట్స్‌’లో పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రామన్‌ జిత్‌ సింగ్‌ చిమా వ్యాఖ్యానించారు. అందరికి అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషిస్తే పర్వాలేదుగానీ, వ్యక్తిగతమైన డేటాను విశ్లేషించడమంటే నేరమే అవుతుందని ఆయన అన్నారు. ఆస్మా టూల్‌ గురించి అన్నింటికన్నా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పారదర్శకత లేకపోవడమని ‘సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌నెట్‌ అండ్‌ సొసైటీ’ అనే స్వచ్ఛంద పరిశోధనా సంస్థకు చెందిన అంబర్‌ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ టూల్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో, ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియదు. ప్రతి వ్యక్తి సోషల్‌ మీడియా కార్యకలాపాలపై నిఘా కొనసాగించడమంటే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.

బ్రిటన్‌లోని రాజకీయ కన్సల్టెంట్‌ సంస్థ కేంబ్రిడ్జి అనలిటికా ఫేస్‌బుక్‌ సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆస్మా లాంటి నిఘా టూల్స్‌పై ఆందోళన పెరిగింది. అన్నింటా ప్రచారానికి ముందుండే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ టూల్‌ను గుట్టుగా అమలు చేస్తుందంటే రానున్న ఎన్నికల్లో సోషల్‌ మీడియా సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికేనని కొంత మంది రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా