కేసుల్లో ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్

1 Nov, 2016 00:58 IST|Sakshi
కేసుల్లో ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్

న్యాయవ్యవస్థపై భారం తగ్గించాలి: ప్రధాని మోదీ
ఆలిండియా జ్యుడీషియల్‌ సర్వీసు అమలుపై చర్చ జరగాలన్న మోదీ
న్యాయ విలువలు పాటించడంలో రాజీపడొద్దు: సీజేఐ ఠాకూర్‌
సర్దార్‌ పటేల్‌కు మోదీ నివాళులు.. ఘనంగా ఏక్తా దివస్‌
సైన్యంతో కలసి మోదీ దీపావళి వేడుకలు


ఉపాధ్యాయుడు తన పదవీకాలంపై కోర్టు కేసు గెలిస్తే.. ఆ తీర్పును మిగతా వారికి ఉపయోగపడేలా కొలమానంగా ఉపయోగించాలి. ‘లిటిగేషన్‌ పాలసీ’ ఖరారు చేయడంలో కేంద్రం విఫలమైంది. తాజా పరిణామాల దృష్ట్యా ఈ పాలసీ నమూనా బిల్లులో మార్పులు జరుగుతున్నాయి. కేసుల్లో తుది నిర్ణయం కోర్టులకు వదిలేయాలన్న అంశంపై స్పష్టత అవసరం.    
– నరేంద్ర మోదీ

 
 న్యూఢిల్లీ/సిమ్లా:  కోర్టుల్లోని కేసుల్లో ప్రభుత్వమే అతి పెద్ద లిటిగెంట్(కక్షిదారు) అని, వీటి పరిష్కారానికే న్యాయవ్యవస్థ ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోర్టులపై ఈ భారాన్ని తగ్గించాల్సిన అవసరముందని, అందుకోసం జాగ్రత్తగా పరిశీలించాక కేసులు వేయాలని సూచించారు. ఢిల్లీ హైకోర్టు స్వర్ణోత్సవాల్లో సోమవారం ఆయన ప్రసంగిస్తూ... దేశంలో ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసు(ఏఐజేఎస్)ను  ప్రారంభించాల్సిన అవసరముందన్నారు. పదవీకాలం, పరోక్ష పన్నులు, ఇతర అంశాల కు సంబంధించి కోర్టుల్లోని 46 శాతం కేసు ల్లో ప్రభుత్వం లిటిగెంట్‌గా ఉందని మోదీ చెప్పారు. ‘ఉపాధ్యాయుడు తన పదవీకాలంపై కోర్టు కేసు గెలిస్తే ఆ తీర్పును మిగతా వారికి ఉపయోగపడేలా కొలమానంగా ఉపయోగించాలి. ‘లిటిగేషన్ పాలసీ’ నమూనా బిల్లులో మార్పులు జరుగుతున్నాయి. కేసుల్లో తుది నిర్ణయం కోర్టులకు వదిలేయాలన్న దానిపై స్పష్టత కావాలి’ అని అన్నారు.   

 న్యాయవ్యవస్థకు చెడ్డపేరు: సీజేఐ
 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ మాట్లాడుతూ... న్యాయ విలువలపై ఎప్పుడూ రాజీపడకూడదని, అవకతవకలు మొత్తం న్యాయవ్యవస్థకే అప్రతిష్ట తీసుకొస్తున్నాయని అన్నారు. జడ్జీలు ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా వృత్తిపరమైన నిజాయితీ కలిగి ఉండాలని సూచించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రసంగిస్తూ... తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని జడ్జీలు మాట్లాడుకోవడం విన్నానన్నారు. ఈ ఆరోపణలను కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వేదికపైనే ఖండించారు.  

 అందరివాడు పటేల్ : మోదీ
 భారత్‌ను శక్తిమంత మైన జాతిగా తీర్చిదిద్దాలని, విభజన శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 141వ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహించారు. ప్రధాని మాట్లాడుతూ... ‘రాజకీయ దృఢ సంకల్పంతో సర్దార్ పటేల్ భారత్‌ను సంఘటిత పరిచారు ’ అని అన్నారు.  పటేల్ జ్ఞాపకార్థం ఢిల్లీలో డిజిటల్ మ్యూజియాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. ‘పటేల్ కాంగ్రెస్ నేత . నాది బీజేపీ . అయినా జయంతి వేడుకలను అదే ఉత్సాహంతో జరుపుకోవడమే మంచి ఐక్యతాసందేశం’ అని మోదీ అన్నారు. స్వతహాగా గుజరాతీ అయిన గాంధీ.. మరో గుజరాతీని(పటేల్) ప్రధానిగా  ఎంపిక చేయలేదని సరదాగా అన్నారు. ఢిల్లీలోని పటేల్ చౌక్‌లో పటేల్ విగ్రహానికి మోదీ పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రం ఇండియా గేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో స్టాంపు విడుదల చేశారు. మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొనడానికి వచ్చిన పిల్లలతో ప్రధాని సమైక్యతా ప్రతిజ్ఞ చేయించి... అనంతరం పరుగును ప్రారంభించారు.  కాగా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 32వ వర్ధంతి సందర్భంగా మోదీ నివాళులర్పించారు.
 
 సైన్యంతో కలసి దీపావళి వేడుకలు
 హిమాచల్‌ప్రదేశ్‌లోని చైనా సరిహద్దుల్లో ఆదివారం సైన్యంతో కలసి ప్రధాని  మోదీ  దీపావళి పండుగ జరుపుకున్నారు. ఆలివ్ గ్రీన్ డ్రెస్‌లో హాజరైన మోదీ.. ఇండో-టిబెటియన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), డోగ్రా స్కౌట్స్‌తో పాటు జవాన్లను కలుసుకున్నారు. సుమ్‌డోలో జవాన్‌లకు మోదీ స్వీట్లు తినిపించారు. యాపిల్స్‌కు ప్రసిద్ధి చెందిన ఛాంగో గ్రామంలో మహిళలు, చిన్నారులతో కాసేపు గడిపారు. ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛన్’ కోసం రూ.5,500 కోట్లు విడుదల చేశామని, సైనికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. కొద్దిరోజులుగా జవాన్లు అలుపు లేకుండా పనిచేస్తున్నారని.. వారి త్యాగం వెలకట్టలేనిదని ఆదివారం ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రతి పౌరుడు సైనికులను చూసి గర్వపడాలన్నారు. అలాగే దీపావళి సందర్భంగా ‘సందేశ్ 2 సోల్జర్స్’ అభ్యర్థనకు స్పందించిన వారికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు