యూపీ ప్రభుత్వ పత్రికా ప్రకటనలు ఇక సంస్కృతంలోనూ..

18 Jun, 2019 15:25 IST|Sakshi

 లక్నో, ఉత్తరప్రదేశ్‌ : యూపీ  ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ప్రతికా ప్రకటనలు, ముఖ్యమంత్రి ప్రసంగాలు ఇకనుంచి సంస్కృతంలో కూడా వెలువడనున్నాయని ఆ రాష్ట్ర అధికారులు మంగళవారం తెలిపారు. దీనికి సంబంధించి  మొదటి ప్రెస్‌ రిలీజ్‌ను సంస్కృతంలో విడుదల చేశారు. సోమవారం జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ.. సంస్కృతం అనేది మన రక్తంలోనే ఉందని, భారతదేశంలో సంస్కృత భాష ఒక భాగమని కానీ, నేడు కేవలం పుజారులకు వృత్తి భాషగా మాత్రమే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృతానికి పునర్‌వైభవం తీసుకురావడానకే  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమైన ప్రసంగాలు, ప్రభుత్వ సమాచారం హిందీ, ఇంగ్లీష్ మరియు ఉర్దూలతోపాటు సంస్కృతంభాషలోనూ  విడుదల చేయనున్నారు.

ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి  ప్రసంగపత్రాన్ని సంస్కృతంలో కూడా విడుదల చేశారు. ఇప్పుడు దాన్ని మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రసంగాలను సంస్కృతంలోకి అనువదించడానికి లక్నోకు చెందిన రాష్ట్రీయ సంస్కృత సంస్థ సహాయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో 25 పత్రికలు సంస్కృతంలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. కానీ వాటిలో ఏవి దిన పత్రికలు కావు.

మరిన్ని వార్తలు