కరోనా కలకలం : ఈ-వీసాల నిలిపివేత

3 Feb, 2020 20:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా నుంచి భారత్‌కు చేరుకున్న ముగ్గురు కేరళ వాసులకు ఇప్పటివరకూ కరోనా వైరస్‌ సోకినట్టుగా నిర్దారణ కావడంతో భారత్‌ మరింత అప్రమత్తమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో చైనా పాస్‌పోర్ట్‌లు కలిగిన వారికి, ఆ దేశంలో నివసిస్తున్న ఇతర దేశాల వారికి ఈ వీసా జారీని కొద్దికాలం పాటు నిలిపివేసింది. ఇక ఇప్పటివరకూ విమానాల్లో భారత్‌కు వచ్చిన 58,658 మంది ప్రయాణీకులకు తనిఖీలు నిర్వహించగా 142 మంది వైరస్‌ అనుమానితులను పరీక్షించగా వారిలో 128 మంది నమూనాలు నెగెటివ్‌గా ఉన్నట్టు వెల్లడైంది.

​ఇక కేరళలో వెల్లడైన మూడు కరోనా పాజిటివ్‌ కేసులను పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందచేస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. వుహాన్‌ నుంచి తాజాగా వచ్చిన 330 మంది ప్రయాణీకులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.మరోవైపు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నాహక చర్యలపై సోమవారం కేబినెట్‌ సెక్రటరీ అధ్యక్షతన ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చైనా నుంచి తిరిగివచ్చినవారు ఇంటికే పరిమితం కావాలని అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.

చదవండి : చైనా సంకల్పం : కేవలం 10 రోజుల్లోనే..

మరిన్ని వార్తలు