ప్రభుత్వమే స్టింగ్ ఆపరేషన్ చేసిందా?

13 Dec, 2016 08:34 IST|Sakshi
ప్రభుత్వమే స్టింగ్ ఆపరేషన్ చేసిందా?
సాధారణంగా స్టింగ్ ఆపరేషన్లు అంటే ఏవైనా పదవుల్లో ఉన్నవాళ్లు చేసే అవినీతిని బయటపెట్టడానికి మీడియా సంస్థలు చేస్తాయి. కానీ.. ఇప్పుడు విచిత్రంగా ప్రభుత్వమే ఈ స్టింగ్ ఆపరేషన్లు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పెద్దనోట్లను రద్దుచేసి కొత్తగా 2వేల రూపాయల నోట్లను ముద్రించిన తర్వాత.. వాటిని పరిమిత సంఖ్యలో మాత్రమే బ్యాంకుల ద్వారా సామాన్యులకు అందిస్తున్నారు. కానీ, కొంతమంది పెద్దమనుషుల దగ్గర మాత్రం కోట్ల రూపాయల్లో ఈ కొత్త నోట్లు బయటపడుతున్నాయి. ఇందులో బ్యాంకు అధికారుల హస్తం ఉందన్న విషయం స్పష్టంగా తెలిసినా, ఎంతమంది అలా చేస్తున్నారో తెలియకపోవడంతో.. ప్రభుత్వమే ఇలాంటి అవినీతిపరులైన బ్యాంకు అధికారులపై స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సీడీలను సంబంధిత ఉన్నతాధికారులకు అందించినట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన మొత్తం 625 శాకలలో ఈ స్టింగ్ ఆపరేషన్లు చేశారంటున్నారు. కనీసం 425 శాఖల్లో అవినీతిపరులైన బ్యాంకు అధికారులు, వ్యాపారులు, హవాలా ఆపరేటర్లు.. వీళ్లంతా నల్లధనాన్ని తెల్లగా మారుస్తామని చెబుతూ టేపుల్లో పట్టుబడ్డారని సమాచారం. కేవలం మెట్రో నగరాల్లోనే కాక, కొన్ని చిన్న పట్టణాల్లో కూడా ఈ స్టింగ్ చేశారని అంటున్నారు. 
 
పెద్దనోట్ల రద్దు చర్యను పక్కదోవ పట్టించడానికి ఎవరైనా అవినీతి కార్యకలాపాలకు పాల్పడితే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు సందర్భాల్లో గట్టిగా హెచ్చరించారు. ఆ ప్రకారమే ఈ స్టింగ్ ఆపరేషన్ చేసి.. ఎక్కడెక్కడ అవినీతిపరులు ఉన్నారో నిగ్గుతేల్చినట్లు తెలుస్తోంది. ఈనెల పదో తేదీన గుజరాత్‌లోని దీసాలో ఒక ర్యాలీలో మాట్లాడుతూ నల్లధనాన్ని దాచిపెట్టుకునేవాళ్లను, అవినీతిపరులను క్షమించేది లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదలకు ఇబ్బందులు సృష్టించేవాళ్లు ఎవరైనా సహించేది లేదని యూపీలోని బహ్రైచ్‌లో మాట్లాడుతూ చెప్పారు. పలువురు సీనియర్ బ్యాంకు అధికారులను కూడా పట్టుకున్నామన్నారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు జరుపుతున్న సోదాల్లో కోట్లాది రూపాయల్లో కొత్తనోట్లు బయటపడుతున్నాయి. బ్యాంకు అధికారుల సాయం లేకుండా ఇంత పెద్దమొత్తం సేకరించడం సాధ్యం కాదనేది బహిరంగ రహస్యమే అయినా, ఇప్పటివరకు పట్టుబడ్డ బ్యాంకు అధికారులు మాత్రం చాలా తక్కువమంది.
మరిన్ని వార్తలు