ఎనిమీ భూముల వేలం?

23 Oct, 2018 02:01 IST|Sakshi

 వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్రానికి కేంద్రం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : యుద్ధ సమయంలో దేశం విడిచి వెళ్లి శత్రు దేశాల్లో స్థిరపడినవారి భూముల (ఎనిమీ ప్రాపర్టీస్‌)ను వేలం వేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెలాఖరుకల్లా సమగ్ర నివేదిక అందజేయాలని కోరుతూ గత నెల లో రాష్ట్రానికి లేఖ రాసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రజనీ సిబల్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి రాసిన లేఖలో ఎనిమీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఆ భూముల స్థితిగతులేంటి? ఆక్రమణలున్నా యా? అసలు మొత్తం భూములెన్ని? ఖాళీగా ఉన్న భూములెన్ని? వాటి విలువ ఎంత? వంటి వివరాలతో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన వాల్యుయేషన్‌ కమిటీలతో నిర్ధారణ చేయించాలని కోరినట్టు సమాచారం.

కేంద్రం లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈ భూములు 490 ఎకరాల వరకు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 100 ఎకరాలను మెట్రో రైలుకు కేటాయించారు. కొన్ని భూములు కబ్జా అయ్యాయి. 2017 మార్చి 14న అమల్లోకి వచ్చిన ఎనిమీ ప్రాపర్టీస్‌ యాక్ట్‌– 1968(సవరణ) చట్టం ప్రకారం ఎనిమీ భూములపై సర్వాధికారాలు కేంద్రానికి సంక్రమించాయి. దీంతో మియాపూర్‌ భూము ల్లో ఖాళీగా ఉన్న 100 ఎకరాలను సీఆర్పీఎఫ్‌కు కూడా కేటాయించింది.  మొత్తం మీద ఈ నెలాఖరు కల్లా ఎనిమీ భూముల వివరాలతో నివేదిక పంపా లని కేంద్రం ఆదేశించడంతో రాష్ట్ర యంత్రాంగం ఆ నివేదిక తయారీలో నిమగ్నం కావడం గమనార్హం.  

రూ.5 వేల కోట్లపై మాటే 
ఎనిమీ భూములకు బహిరంగ మార్కెట్‌ విలువ రూ.5 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా.  ఆ భూములను వేలం వేస్తే వచ్చే ఆదాయంలో రాష్ట్రా నికి కూడా వాటా ఉంటుంది. కస్టోడియన్‌ హోదాలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎనిమీ భూముల్లో రాష్ట్రానికి కూడా వాటా దఖలు పడుతుంది. అయితే, వీటిని వేలం వేస్తారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది.   

మరిన్ని వార్తలు