సల్ఫర్‌ ఎరువుపై రాయితీ 84 పైసలు పెంపు

1 Aug, 2019 04:17 IST|Sakshi

యథాతథంగా ఎన్,పీ,కేలపై రాయితీలు

సుప్రీం జడ్జీల పరిమితి పెంపు

కేంద్ర కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: సల్ఫర్‌ ఎరువుపై రాయితీని కేజీకి 84 పైసలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ రాయితీ కేజీకి రూ. 2.72 ఉండగా, దానిని రూ. 3.56కు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే యూరియాయేతర, ఇతర పోషక ఎరువులకు ఇస్తున్న రాయితీలో మార్పులేమీ లేవని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో యూరియాయేతర ఎరువులకు రాయితీ ఇచ్చేందుకు వెచ్చించే మొత్తం రూ. 22,875.5 కోట్లుగా ఉంటుందని ఆయన చెప్పారు.

జవదేకర్‌ మాట్లాడుతూ ‘దేశంలో యూరియా వాడకం ఎక్కువగా ఉంది. అయితే వ్యవసాయానికి యూరియా ఎంత ముఖ్యమో ఎన్‌పీకేఎస్‌ (ఎన్‌–నైట్రోజన్, పీ–ఫాస్ఫాటిక్, కే–పొటాసిక్, ఎస్‌–సల్ఫర్‌) కూడా అంతే ముఖ్యం. ఎన్‌పీకేఎస్‌ పోషకాలకు కూడా ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. సల్ఫర్‌(ఎస్‌)పై రాయితీని కేజీకి ప్రస్తుత రూ. 2.72 నుంచి రూ. 3.56కు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే ఎన్,పీ,కేలపై రాయితీల్లో మార్పులేమీ ఉండవు’ అని వివరించారు. ప్రస్తుతం నైట్రోజన్‌(ఎన్‌)పై కేజీకి రూ. 18.9, ఫాస్ఫాటిక్‌(పీ)పై కేజీకి రూ. 15.21, పొటాసిక్‌(కే)పై కేజీకి రూ. 11.12లను కేంద్రం రాయితీగా ఇస్తోంది.

యూరియాయేతర ఎరువులు రైతులకు అందుబాటు ధరల్లోనే ఉండాలనే ఉద్దేశంతో సల్ఫర్‌పై రాయితీని పెంచినట్లు జవదేకర్‌ చెప్పారు. కాగా, కేంద్రం ఓ ప్రకటన విడుదల చేస్తూ సల్ఫర్‌పై రాయితీని పెంచుతున్నట్లు ఏ రోజు నోటిఫికేషన్‌ విడుదల అవుతుందో ఆ రోజు నుంచే కొత్త రాయితీ అమల్లోకి వస్తుందనీ, అప్పటి వరకు ప్రస్తుత రేట్లే ఉంటాయని స్పష్టం చేసింది. యూరియాయేతర ఎరువులైన డీఏపీ (డై–అమ్మోనియం ఫాస్ఫేట్‌), ఎంవోపీ (మ్యురియేట్‌ ఆఫ్‌ పొటాష్‌), ఎన్‌పీకేల ధరలను వాటి తయారీదారులే నిర్ణయించుకుంటారు. అయితే ప్రభుత్వం వాటిపై కొంత రాయితీని మాత్రం ఇస్తుంది. ఆ రాయితీ ఎంతనేది ఏయేటికాయేడు కేంద్రం నిర్ణయిస్తుంది.  

కశ్మీర్‌ ఈడబ్ల్యూఎస్‌ కోటాకు ఓకే
ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కశ్మీర్‌కు చెందిన ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న రిజర్వేషన్లకు తోడుగా ‘కశ్మీర్‌ ఈడబ్ల్యూఎస్‌’ కోటాను అమలుచేస్తారని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. మరోవైపు, ఓబీసీల్లో ఉపవర్గాలపై అధ్యయ నానికి ఏర్పాటైన కమిటీ కాల పరిమితిని వచ్చే ఏడాది జనవరి 31 వరకు గడువు పెంచింది.

సుప్రీం జడ్జీలు 34మంది
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మరింత పరిపుష్టంకానుంది. కోర్టు జడ్జీల గరిష్ట సంఖ్యను 34కు పెంచుతూ కేంద్ర కేబినెట్‌ బుధవారం నిర్ణయం తీసుకుందని కేబినెట్‌ భేటీ తర్వాత కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాతో చెప్పారు. సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య దాదాపు 60,000కు చేరుకున్న నేపథ్యంలో జడ్జీల పరిమితి పెరగడం గమనార్హం. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి అనుమతించిన సుప్రీం జడ్జీల సంఖ్య 30గా ఉంది. జడ్జీల గరిష్ట పరిమితిని పెంచాలని గతంలో ప్రధాని మోదీకి సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ లేఖరాయడం తెల్సిందే. ‘ మూడు దశాబ్దాల క్రితం 1988లో సీజేఐని మినహాయించి జడ్జీల సంఖ్య పరిమితిని 18 నుంచి 25కు పెంచారు. తర్వాత మరో రెండు దశాబ్దాలకు 2009లో 30కి పెంచారు. పోగుబడుతున్న కేసులను త్వరగా తేల్చాలన్నా, ప్రజలకు సరైన సమయానికి న్యాయం దక్కాలన్నా, రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటు జరగాలన్నా జడ్జీల సంఖ్య పెంచడం తప్పదు’ అని మోదీకి రాసిన లేఖలో సీజేఐ పేర్కొన్నారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు