బడ్జెట్ భేటీపై ‘జేఎన్‌యూ’ నీడ!

17 Feb, 2016 01:27 IST|Sakshi
బడ్జెట్ భేటీపై ‘జేఎన్‌యూ’ నీడ!

జేఎన్‌యూ వివాదంపై అఖిలపక్ష భేటీలో విపక్షం ప్రశ్నల వర్షం
♦ కన్హయ్య అరెస్ట్ అన్యాయమన్న కాంగ్రెస్, వామపక్షాలు
♦ వర్సిటీల వివాదాలు పార్లమెంటులో ప్రతిధ్వనిస్తాయన్న లెఫ్ట్
♦ ఆ నినాదాలు అభ్యంతరకరమైనవి.. సభలో చర్చకు సిద్ధం: సర్కారు
♦ తాను దేశం మొత్తానికీ ప్రధానినని, ఒక్క పార్టీకి కాదని మోదీ వ్యాఖ్య
♦ సమావేశాలు సజావుగా సాగాలన్న అంశంపై స్థూల ఏకాభిప్రాయం
 
 న్యూఢిల్లీ: ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదం.. మరో వారంలో మొదలుకానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిధ్వనిస్తుందన్న విషయం స్పష్టమైంది. బడ్జెట్ సమావేశాల్లో సహకారం కోరుతూ ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు జేఎన్‌యూ వివాదంపై ప్రశ్నలు లేవనెత్తాయి. వర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌ను దేశద్రోహం అభియోగాలపై అరెస్ట్ చేయటం అన్యాయమని కాంగ్రెస్, వామపక్షాలు తప్పుపట్టాయి. అయితే.. వర్సిటీలో విద్యార్థులు చేసిన నినాదాలు తీవ్ర అభ్యంతరకరమైనవని ప్రభుత్వం పేర్కొంది.

జేఎన్‌యూ వివాదంపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చర్చించటానికి సిద్ధమంది. ఈ నెల 23వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో మోదీ ఈ అఖిలపక్ష  భేటీ నిర్వహించారు. తాను మొత్తం భారతదేశానికీ ప్రధానమంత్రినని, కేవలం ఒక్క పార్టీకి కాదని పేర్కొంటూ.. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగటానికి సహకరించాలని విపక్షాలను కోరారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో వరుసగా ప్రతిష్టంభనలు ఏర్పడుతున్న నేపథ్యంలో.. బడ్జెట్ భేటీల విషయంలో మోదీ ముందుగానే చొరవ తీసుకుంటూ ఈ భేటీని ఏర్పాటు చేశారు. ‘‘ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలకు స్పందిస్తాం..పరిష్కరిస్తాం. ఇక్కడ కనిపించిన సుహృద్భావ వాతావరణం పార్లమెంటులోనూ ప్రతిఫలిస్తుందని ఆశిస్తున్నా’’ అని ఆకాంక్షించారు. పార్లమెంటులో బిల్లులను వాటి గుణగణాల ఆధారంగా ఆమోదించాలన్నది తమ పార్టీ వైఖరి అంటూ  కాంగ్రెస్ పార్టీ బంతిని సర్కారు కోర్టులోకే నెట్టివేసింది. భేటీ  రెండు గంటలకు పైగా సాగింది. ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ భేటీలు సజావుగా సాగాలన్న అంశంపై స్థూల ఏకాభిప్రాయం వచ్చిందన్నారు.  

 బీజేపీ వచ్చాక వాతావరణం కలుషితం
 జేఎన్‌యూ వివాదంలో ‘దేశ వ్యతిరేకుల’కు ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతిస్తోందంటూ అధికార బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో.. దేశ సమైక్యత, రాజ్యాంగంపై దాడి చేస్తూ నినాదాలు చేసిన విద్యార్థులతో తమ పార్టీకి ఏ సంబంధమూ లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్ ఈ భేటీలో పేర్కొన్నారు. అయితే.. కన్హయ్య దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణకు ఎలాంటి సాక్ష్యమూ లేదని తప్పుపట్టారు. కన్హయ్య.. రాజ్యాంగానికి గానీ, దేశానికి గానీ వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో వాతావరణం కలుషితంగా మారిపోయిందని.. అందుకు బాధ్యులైన వారిపై ఆ పార్టీ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య అంశం గురించీ కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తూ.. బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ ప్రోద్బలంతోనే అతడిని ఒత్తిడికి గురిచేశారన్నారు. తమ పార్టీ నాయకత్వాన్ని దేశ వ్యతిరేకులని విమర్శిస్తూ అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తుతూ.. అటువంటి వారిని ప్రభుత్వం నియంత్రించాలనిసూచించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించటానికి కారణమైన ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయాల గురించీ కాంగ్రెస్ లేవనెత్తింది.

 సంయమనం పాటించాలి: వెంకయ్య
 జేఎన్‌యూ వర్సిటీ వివాదంపై ప్రభుత్వ వైఖరిని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీలో వివరించారు. వర్సిటీ కార్యక్రమంలో చేసిన నినాదాలు, అతికించిన పోస్టర్లు తీవ్ర అభ్యంతరకరమైనవన్నారు. ‘దేశ వ్యతిరేకం’ వంటి పదాల వినియోగంపై ప్రతిపక్ష నేతల ఆందోళనను గుర్తిస్తున్నామంటూనే.. ప్రధానిని ఉద్దేశించి చేసిన ‘హిట్లర్’ విమర్శలను వెంకయ్య ప్రస్తావించారు. పార్టీలన్నీ సంయమనం పాటించాలన్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ నెల 22న లాంఛనంగా జరిగే అఖిలపక్ష భేటీలో.. సమావేశాల అంశాలతో పాటు, ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి చర్చిస్తామని వెంకయ్య తెలిపారు.
 
 ఆలయంలో గంట మోగుతుంది: వామపక్షాలు
 దేశంలోని వర్సిటీల్లో జరుగుతున్న పరిణామాల గురించి, అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలన గురించి అఖిలపక్ష భేటీలో వామపక్షాలు లేవనెత్తాయి. వీటిపై ప్రధాని జోక్యం చేసుకోవాలన్నాయి. ‘సీపీఎం కార్యాలయంపై దాడి చేశారు. ఏచూరికి బెదిరింపులు వచ్చాయి. సీపీఐ నేత డి.రాజాకు బెదిరింపులు వస్తున్నాయి’ అని సీపీఎం నేత మొహమ్మద్ సలీం ఆ తర్వాత మీడియాతో అన్నారు.. ‘‘బయట ఇంత గందరగోళం జరుగుతున్నపుడు ప్రజాస్వామ్య ఆలయం (పార్లమెంటు)లో గంట మోగుతుంది’ అని పేర్కొన్నారు. జీఎస్‌టీ బిల్లు ఆమోదానికి కృషి చేయాలని తృణమూల్‌కాంగ్రెస్ కోరింది. పార్లమెంటు సజావుగా సాగాలని, చర్చ జరగాలని జేడీయూ చీఫ్ శరద్‌యాదవ్ సూచించారు.

మరిన్ని వార్తలు