మళ్లీ లోక్‌సభకు ‘ఎన్‌సీబీసీ’ బిల్లు!

24 Nov, 2017 02:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇతర వెనకబడిన తరగతుల(ఓబీసీ) జాతీయ కమిషన్‌ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో మరోసారి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సమావేశాల్లోనే ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. కానీ రాజ్యసభ మాత్రం కొన్ని సవరణలతో దీన్ని ఆమోదించడంతో.. ఈ బిల్లు మరోసారి లోక్‌సభ ముందుకు రావాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. ‘నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ (ఎన్‌సీబీసీ)’కు కూడా షెడ్యూల్డ్‌ కులాలు, తెగల జాతీయ కమిషన్‌ తరహాలో రాజ్యాంగబద్ధ హోదా లభిస్తుంది.

ఓబీసీలు చాన్నాళ్లుగా కోరుతున్న ఈ రాజ్యాంగబద్ధ హోదా లభిస్తే.. దేశవ్యాప్తంగా వెనకబడిన వర్గాల మద్దతు బీజేపీకి లభించే అవకాశాలున్నాయని కాషాయ పార్టీ భావిస్తోంది. ఎన్‌సీబీసీ రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పడితే.. దానికి ఓబీసీల హక్కులు, ప్రయోజనాలకు బలమైన రక్షణ కల్పించే అధికారం లభిస్తుంది. 1993లో ఎన్‌సీబీసీని పరిమిత అధికారాలతో చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. ఏ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలి, ఏ కులాన్ని జాబితా నుంచి తొలగించాలనే సూచనలిచ్చే అధికారం మాత్రమే ఆ సంస్థకు ఉండేది. ఓబీసీల ఫిర్యాదుల పరిష్కార బాధ్యత కూడా షెడ్యూల్‌ కులాల జాతీయ కమిషన్‌కే ఉండేది. ఎన్‌సీబీసీ ఏర్పడితే ఓబీసీల ఫిర్యాదుల పరిష్కారం, హక్కులు, అధికారాల పరిరక్షణ.. మొదలైనవి ఆ సంస్థ పరిధిలోకి వస్తాయి.

మరిన్ని వార్తలు