అయోధ్యలో 221 మీటర్ల రాముడి విగ్రహం!

26 Nov, 2018 08:32 IST|Sakshi

లక్నో: ఓ వైపు అయోధ్యలో రామమందిర నిర్మాణంపై చర్చ జరుగుతుంటే.. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం 221 మీటర్ల పొడవైన భారీ రాముడి విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో నిర్మించిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ (182 మీటర్లు) ప్రపంచంలోనే పొడవైంది కాగా దీని కంటే పొడవుగా ‘స్టాచ్యూ ఆఫ్‌ ది మర్యాద పురుషోత్తమ్‌’ పేరుతో అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యోగి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

రాముడి విగ్రహం 151 మీటర్ల పొడవుంటుందని.. దానిపై గొడుగు 20 మీటర్లు, విగ్రహం పునాది మరో 50 మీటర్ల ఎత్తు ఉంటుందని ఆ రాష్ట్ర సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి అవనీశ్‌ అవస్థి తెలిపారు. విగ్రహం కింద భాగంలో అయోధ్యతోపాటు ‘ఇక్ష్వాకు వంశం’ చరిత్రకు సంబంధించిన విశేషాలతో అధునాతన మ్యూజియం ఏర్పాటుచేస్తామని చెప్పారు. 


 

మరిన్ని వార్తలు