విజయ్ మాల్యా పాస్ పోర్టు రద్దు

24 Apr, 2016 10:34 IST|Sakshi

బ్రిటన్‌లో ఉన్నట్లు భావిస్తున్న ‘ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు’ విజయ్ మాల్యా మరింత ఇరుకున పడ్డారు. విజయ్ మాల్యా డబ్బు లావాదేవీల్లో చట్టాన్ని ఉల్లంఘించారని, కేసు విచారణకు  సరిగా సహకరించడంలేదని ఈ నేపథ్యంలో మాల్యా పాస్ పోర్టు రద్దు చేస్తున్నట్టు ఆదివారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. సెక్షన్ 10(3)(సీ) అండ్(హెచ్) ఆఫ్ పాస్ పోర్ట్ ఆక్ట్ ప్రకారం విజయ్ మాల్యా పాస్ పోర్టు ను రద్దు చేశామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మాల్యాను స్వదేశానికి రప్పించే డిపోర్టేషన్ ప్రక్రియ ప్రారంభించాలంటూ విదేశీ వ్యవహారాల శాఖను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఆశ్రయించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) వచ్చేలా సీబీఐ కి త్వరలోనే ఈడీ లేఖ రాయనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు తీసుకున్న రుణంలో మాల్యా 430 కోట్ల రూపాయల వరకూ విదేశాలకు మళ్ళించారన్నది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదన.

మరోవైపు తొమ్మిదివేల కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసుకు సంబంధించి మాల్యాపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిపింది. తన విదేశీ ఆస్తుల వివరాలను అడిగే అధికారం బ్యాంకులకు లేదని, తన భార్యా, పిల్లలు ఎన్నారైలు కావడంతో తన ఆస్తుల వివరాలను వెల్లడించక్కర లేదని మాల్యా ఇప్పటికే సుప్రీం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు