‘ఆ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలి’

27 Dec, 2018 14:55 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌ తాజా బిల్లును సెలెక్ట్‌ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. బిల్లుపై గురువారం మధ్యాహ్నం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా పాలక, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులు తీసుకోవడంతో ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం పేర్కొనగా మతపరమైన అంశాల్లో జోక్యం తగదని కాంగ్రెస్‌ నేతృత్వంలో తృణమూల్‌, ఎన్సీపీ, ఆప్‌, ఎంఐఎంలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రవేశపెడుతూ దీన్ని రాజకీయ కోణంలో చూడరాదని, మానవతా దృక్పథంతో పరిశీలిం‍చాలని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ను 20 ఇస్లామిక్‌ దేశాలు నిషేధించగా, భారత్‌ వంటి లౌకిక దేశాల్లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ఎవరైనా కట్నం డిమాండ్‌ చేయడం, మహిళలను వేధించడం చేస్తే వారి అరెస్ట్‌లకు అనుమతించే పార్లమెంట్‌ ట్రిపుల్‌ తలాక్‌ను ఎందుకు వ్యతిరేకించదని అన్నారు.

ఈ బిల్లు ఏ మతం, వర్గం విశ్వాసాలను దెబ్బతీయదని స్పష్టం చేశారు. ఈ బిల్లు చాలా కీలకమని, దీనిపై లోతైన అథ్యయనం అవసరమని ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ఆయన కోరారు. తృణమూల్‌ సభ్యుడు సుదీప్‌ బందోపాధ్యాయ సైతం ఖర్గే వాదనతో ఏకీభవించారు.

>
మరిన్ని వార్తలు