-

అమానుషం: శ‌వాల‌ ప‌క్క‌న‌ కూలీలు

18 May, 2020 19:58 IST|Sakshi

ప్ర‌యాగ్‌రాజ్ : ఇప్ప‌టికే జీవ‌నోపాధి కోల్పోయి జీవ‌చ్ఛ‌వాలుగా బతుకుతున్న వ‌ల‌స కూలీల‌ను శ‌వాల‌తో పాటు ఒకే ట్ర‌క్కులో త‌ర‌లించిన అమానుష ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. యూపీలోని ఔరాయ‌లో శ‌నివారం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. వ‌ల‌స కూలీల ట్ర‌క్కును మ‌రో ట్ర‌క్కు ఢీ కొట్ట‌డంతో 27 మంది మృత్యువాత పడ్డారు. 33 మంది గాయాల‌పాల‌య్యారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకుంటున్న కార్మికుల‌ను స్వ‌స్థ‌లాల‌కు పంపించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందులో భాగంగా ట్ర‌క్కులను ఏర్పాటు చేసింది. అయితే వీటిలో ఓ వైపుగా పాలిథీన్ క‌వ‌ర్ల‌లో క‌ప్పిన శ‌వాలుండ‌గా, మ‌రో వైపు కూలీలు కూర్చున్నారు. క‌నీసం శ‌వాల‌ను ఐస్ బాక్సుల్లోనూ భ‌ద్ర‌ప‌ర్చ‌లేదు. దీంతో వాటి నుంచి వ‌స్తున్న దుర్వాస‌న‌తోనే వంద‌ల కి.మీ ప్ర‌యా‌ణిస్తూ ఉన్నారు. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి)

త‌మ‌ ప‌రిస్థితిని తెలియ‌జేస్తూ ఓ ట్ర‌క్కులోని వ‌ల‌స కార్మికుడు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విష‌యం దృష్టికి వ‌చ్చిన‌ జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోర‌న్ వ‌ల‌స కార్మికుల‌పై నిర్ల‌క్ష్య ధోర‌ణి వ‌హిస్తున్న‌ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌పై తీవ్రంగా మండిప‌డ్డారు. శ‌వాలు తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు, గాయ‌ప‌డినవారిని చేర‌వేసేందుకు బ‌స్సుల‌ను త‌క్ష‌ణమే ఏర్పాటు చేయాల‌ని కోరారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వ యంత్రాంగం ఆదివారం సాయంత్రం ప్ర‌యాగ్‌రాజ్ వ‌ద్ద‌ శ‌వాల‌ను అంబులెన్స్‌లోకి మార్చింది. ఇది ప్ర‌మాదం జ‌రిగిన‌ ఔరియా నుంచి 300 కి.మీ దూరం కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తుకు ఆదేశించాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి. (ఎంత దైన్యం.. ఎంతెంత దూరం..!)

మరిన్ని వార్తలు