నక్సల్స్‌ నిధులకు అడ్డుకట్ట

8 May, 2018 02:03 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర విభాగాల అధికారులతో ప్రత్యేక బృందం

సొంత ఆస్తులు కూడబెడుతుండంతో..

న్యూఢిల్లీ: నక్సలైట్ల ఆదాయ మార్గాలను మూసివేయడంతోపాటు నక్సల్‌ నేతల ఆస్తులను జప్తు చేయడం కోసం వివిధ దర్యాప్తు సంస్థల అధికారులతో ఓ ప్రత్యేక బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ బృందంలో వివిధ కేంద్ర సంస్థలతోపాటు రాష్ట్రాల పోలీసు, సీఐడీ విభాగాల వారు కూడా ఉంటారని హోం శాఖకు చెందిన ఓ అధికారి సోమవారం చెప్పారు. ఈ బృందానికి అదనపు కార్యదర్శి స్థాయి వ్యక్తి నేతృత్వం వహిస్తారనీ, ఐబీ, ఈడీ, డీఆర్‌ఐ, ఎన్‌ఐఏ, సీబీఐ, సీబీడీటీలతోపాటు రాష్ట్రాల నిఘా, నేర దర్యాప్తు విభాగాల అధికారులు కూడా సభ్యులుగా ఉంటారని అధికారి వివరించారు.

నక్సల్‌ నేతలు బలవంతంగా వసూళ్లకు పాల్పడి, అనంతరం ఆ డబ్బును తమ వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడానికి, కుటుంబ సభ్యుల చదువు, విలాసాల కోసం వినియోగిస్తున్నారని సమాచారం అందిన నేపథ్యంలో హోం శాఖ తాజా చర్య తీసుకుంది. బిహార్‌–జార్ఖండ్‌ కమిటీకి చెందిన సీపీఐ (మావోయిస్టు) నేత ప్రద్యుమ్న శర్మ గతేడాది రూ. 22 లక్షలు కట్టి తన సోదరి కూతురిని ఓ ప్రైవేట్‌ వైద్యకళాశాలలో చేర్పించారు. అదే పార్టీకే చెందిన సందీప్‌ యాదవ్‌ అనే మరో నేత నోట్ల రద్దు సమయంలో రూ. 15 లక్షల విలువైన పాత నోట్లను మార్చుకున్నారు. ఆయన కూతురు ఓ ప్రముఖ ప్రైవేట్‌ విద్యా సంస్థలో, కొడుకు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నట్లు అధికారి తెలిపారు. మరో సీనియర్‌ నాయకుడు అరవింద్‌ యాదవ్‌ కూడా తన సోదరుడి చదువు కోసం రూ. 12 లక్షలు చెల్లించారన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు