తూత్తుకుడిలో విద్రోహ శక్తులు

31 May, 2018 03:37 IST|Sakshi
తూత్తుకుడి బాధితులను పరామర్శిస్తున్న రజనీ

నటుడు రజనీకాంత్‌

మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సాయం అందజేత

సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడిలో మే 22న జరిగిన విధ్వంసానికి సంఘ విద్రోహశక్తులే కారణమని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. చెన్నై నుంచి బుధవారం ఉదయం తూత్తుకుడికి చేరుకున్న రజనీ అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన 48 మందికి రూ.10వేలు చొప్పున సాయం అందజేశారు. తర్వాత ఆయన∙మీడియాతో మాట్లాడారు.

‘జిల్లా కలెక్టర్‌ కార్యాలయంపై దాడి, అగ్ని ప్రమాదానికి కారణం సంఘ విద్రోహశక్తులే.ఉద్యమంలోకి సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించాయనే విషయం ముందుగా తెలుసుకోవటంలో పోలీసునిఘా విఫలమైంది. సీఎంగా జయలలిత అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేశారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ఆమె బాటలో సాగాలి’ అని అన్నారు. తూత్తుకుడి ఘటనపై ప్రధాని మోదీ ఇప్పటి వరకు స్పందించకపోవటంపై.. ‘మీడియా చాలా శక్తివంతమైంది. ఈ విషయం ఆయన్నే అడగండి’ అని రజనీ అన్నారు.  
 

మరిన్ని వార్తలు