పరోటాపై అధిక పన్నులు.. కేం‍ద్రం క్లారిటీ!

13 Jun, 2020 15:47 IST|Sakshi

న్యూఢిల్లీ: పరోటాలపై అధిక జీఎస్టీ విధిస్తున్నారనే వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టతనిచ్చాయి. నిల్వ చేసి అమ్మే పరోటాలపైనే 18 శాతం జీఎస్టీ విధిస్తున్నామని తెలిపాయి. రెడీ టు ఈట్‌ పరోటాలపై 5 శాతం జీఎస్టీ మాత్రమే ఉంటుందని జీఎస్టీ అధికారులు వెల్లడించారు. నిల్వ ఉంచి, ప్యాకింగ్‌ చేసి అమ్మే  పరోటాలు మామూలుగా అధిక ధరల్లో ఉంటాయని, వాటిని  సంపన్నశ్రేణివారే కొనుగోలు చేస్తారని అధికారులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పన్ను శ్లాబులను పరిశీలించే..  ప్యాక్డ్‌ ఆహార వస్తువులపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నామని తెలిపారు. ప్యాకింగ్‌ ఆహార పదార్థాలైనందున చౌక ధర బిస్కట్లు, కేకులు, బేకింగ్‌ వస్తువులపై కూడా 18 శాతం జీఎస్టీ విధిస్తున్న విషయాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. టెట్రా ప్యాక్‌ పాలు, ఘనీభవించిన పాల ప్యాకెట్ల ధరల్లో తేడాలు దీనికి ఉదాహరణ అని తెలిపారు.
(చదవండి: పరోటా పంచాయితీపై ఆనంద్‌ మహింద్రా ట్వీట్‌)

కాగా, అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్స్‌ (కర్ణాటక బెంచ్‌) పరోటాలపై 18 శాతం తప్పదని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సాధారణ రోటీలపై 5 శాతం జీఎస్టీ ఉంటుందని, నిల్వ చేసి అమ్మే బ్రాండెడ్ ఆహార వస్తువులపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నామని స్పష్టం చేసింది. దాంట్లో భాగంగానే మూడు నుంచి ఐదు రోజులపాటు సంరక్షించి అమ్మే పరోటాలపై 18 శాతం పన్ను వేస్తున్నామని వెల్లడించింది.

ఇక పరోటాలపై అధిక జీఎస్టీ విధిస్తున్నారని సోషల్‌ మీడియాలో నెటిజన్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పరోటాలపై పగబట్టి 18 శాతం పన్నులు వసూలు చేస్తున్నారని, రోటీ వర్గానికి చెందిన పరోటాలపై ఈ వివక్ష ఎందుకని వారంతా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉత్తర భారతంలో రోటీ ఎక్కువగా తింటారని, దక్షిణ భారతంలో పరోటా ఎక్కువ తింటారని, ఇవి కక్షపూరితంగా చేస్తున్న చర్యలని మరికొందరు పేర్కొన్నారు. పరోటాలపై 18 జీఎస్టీ విధించడం చాలా బాధగా ఉందని మహింద్రా అండ్‌ మహింద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా కూడా ట్విటర్‌లో చెప్పుకొచ్చారు. హ్యాండ్సాఫ్‌ పరోటా హాష్‌టాగ్ ట్విటర్‌లో ట్రెడింగ్‌లో ఉంది.

మరిన్ని వార్తలు