25 లక్షలమంది వికలాంగులకు శిక్షణ

11 Apr, 2016 19:28 IST|Sakshi

న్యూ ఢిల్లీ: వచ్చే ఏడేళ్ళలో 25లక్షల మంది వికలాంగులకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశం సమైక్యతకు, సమానత్వానికి ఎంతో విలువనిస్తుందని,  వసుధైక కుటుంబం అంటూ ప్రపంచం మొత్తాన్ని తన కుటుంబంగా భావించడం మనదేశ సిద్ధాంతమని ఆయన అన్నారు. అదే సిద్ధాంతం మన చుట్టుపక్కల వాతావరణానికి, జీవితాలకు  అన్వయిస్తుందన్నారు.

భారతదేశ జనాభాలో వికలాంగులు సింహభాగం ఉన్నారని, వారికి అర్థవంతమైన ఉపాధి మార్గాలను కల్పించడం అవసరమని  మోదీ తెలిపారు. వచ్చే ఏడేళ్ళలో వైకల్యాలున్న 25 లక్షల మందికి ప్రత్యేక శిక్షణ కల్పించనున్నట్లు నైంత్ వరల్డ్ అసెంబ్లీ ఆఫ్ డిజయబుల్డ్ పీపుల్స్ ఇంటర్నేషనల్ (డీపీఐ) సందర్భంలో మోదీ ఓ సందేశాన్నిచ్చారు.  

ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, ఈ అంశం మోదీ వ్యక్తిగత ఆసక్తిని కనబరచిందని సామాజిక న్యాయం, సాధికారత శాఖామంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా, కరేబియన్ దేశాలతోపాటు  మొత్తం 70 దేశాలనుంచి 200 మందికి పైగా వైకల్యాలున్న వారు హాజరౌతున్నట్లు 150 దేశాల్లో సభ్యత్వం ఉన్న వికలాంగుల మానవ హక్కుల సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తలు