యోగి ఆదిత్యనాథ్‌ సంచలన నిర్ణయం

1 Jul, 2019 12:06 IST|Sakshi

లక్నో : కొత్త కొత్త రూల్స్‌తో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోన్న యుపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మీటింగ్స్‌కు వచ్చేటప్పుడు ఉద్యోగులు ఫోన్‌ తీసుకురాకుడదని.. ఉదయం 9 గంటల్లోపు కార్యాలయాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగులేవరూ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బయటి వ్యక్తులు ఇచ్చే బహుమతులు స్వీకరించకూడదని ఆదేశించారు.

ఈ మేరకు యోగి ప్రభుత్వం ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. దీని ప్రకారం సచివాలయం ఉద్యోగులతో సహా ప్రభుత్వ ఉద్యోగులేవరూ కూడా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి బహుమతులు స్వీకరించకూడదని తెలిపింది. కనీసం స్వీట్‌ బాక్స్‌ కూడా తీసుకోవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు బహుమతులు రూపంలో లంచాలు స్వీకరిస్తుంటారని అందరికి తెలిసిన విషయమే.

అయితే యోగి నిర్ణయం పట్ల గ్రేడ్‌ 3 ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఐఏఎస్‌ అధికారులు బహుమతుల రూపంలో ఖరీదైన వస్తువులు పొందుతారు. మాకు ఇచ్చేది కేవలం స్వీట్‌ బాక్స్‌లు మాత్రమే. వాటిని కూడా వద్దంటే ఎలా’ అని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ యోగి నిజంగానే బహుమతులను బ్యాన్‌ చేయాలని భావిస్తే అధికారుల ఇళ్లలో సోదాలు జరపాలని.. వారి ఇళ్లలో ఉన్న ఖరీదైన వస్తువుల గురించి ఆరా తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు