కేంద్ర విద్యా స్కీమ్‌ల విలీనమే ఓ స్కీమ్‌

31 Jan, 2018 17:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మూడు కేంద్ర పథకాలను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలిమెంటరీ విద్య (ఒకటి నుంచి ఎనిమిదివ తరగతి)కు సంబంధించిన సర్వశిక్షా అభియాన్, సెకండరీ స్కూల్‌ (9,10 తరగతులు)కు వర్తించే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, టీచర్ల విద్యను పునర్‌ వ్యవస్థీకరించి పునర్నిర్మాణానికి దోహదపడే సీఎస్‌ఎస్‌ఆర్‌ఆర్‌టీఈ పథకాన్ని విలీనం చే యాలని నిర్ణయించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం నాడు ఈ అంశాలపై రాష్ట్రాలను ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించింది.
 
ఈ మూడు స్కీమ్‌లను విలీనం చేసి పాఠశాల విద్యాభివృద్ధికి సమగ్ర పథకం (ఇంటిగ్రేటెడ్‌ స్కీమ్‌ ఫర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌) తీసుకరావాలని నిర్ణయించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఓ దక్పథ పత్రాన్ని జనవరి 22వ తేదీనే రాష్ట్రాలకు పంపించింది. నాణ్యత ప్రమాణాలను పట్టించుకోకుండా నిర్వహణా ఖర్చులను భారీగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త స్కీమ్‌ను తీసుకొస్తున్నారని ఈ స్కీమ్‌కు రూపకల్పన చేసిన ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లిటరసీ’లో పదవీ విరమణ చేసిన అధికారి చెప్పారు. నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు కొత్త స్కీమ్‌లో ఎలాంటి నిబంధనలు లేవని ‘సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసర్చ్‌’లో విద్యా పాలన గురించి అధ్యయనం చేసిన కిరణ్‌ భట్టీ వ్యాఖ్యానించారు.

నిర్బంధ విద్యా హక్కును అమలు చేస్తున్న ఏకైకా కేంద్ర పథకం సర్వ శిక్షా అభియాన్‌ను విలీనం చేసినట్టయితే ఎలిమెంటరీ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే అవుతుందని ‘రైట్‌ టు ఎడ్యుకేషన్‌ ఫోరమ్‌’కు చెందిన అంబరీష్‌ రాయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మూడు విద్యా స్కీమ్‌లకు వేర్వేరుగా బడ్జెట్‌ కేటాయింపులు జరపకుండా ఒకే స్కీమ్‌ కింద బడ్జెట్‌ కేటాయింపులు జరపాలని కేంద్రం నిర్ణయించడమే కేంద్రం ఉద్దేశం అర్థం అవుతుందని, పాలనాపరమైన, మానవ వనరుల విషయంలో భారీగా ఖర్చును తగ్గించాలని కేంద్రం చూస్తోందని విద్యా నిపుణులు వాదిస్తున్నారు. అయితే నిరర్థక ఖర్చులను మాత్రమే తగ్గించాలని చూస్తున్నామని కేంద్రం చెబుతోంది. నిరర్థక ఖర్చుల పేరిట దేశంలో విద్యను నిరర్థకం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా