లాల్జీ టాండన్‌ కన్నుమూత 

22 Jul, 2020 04:12 IST|Sakshi

అనారోగ్యంతో మృతి చెందిన మధ్యప్రదేశ్‌ గవర్నర్‌

రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు సంతాపం

లక్నో/న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌(85) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టాండన్‌ మంగళవారం ఉదయం కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. లాల్జీ గుండెపోటుతో చనిపోయినట్లు లక్నోలోని మేదాంత ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. లాల్జీ టాండన్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. లాల్జీ కుమారుడు అశుతోష్‌ టాండన్‌ ప్రస్తుతం యూపీలో కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం లక్నోలోని గులాలా ఘాట్‌లో అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. అంత్యక్రియలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హాజరయ్యారు.  టాండన్‌ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు సంతాపం ప్రకటించారు. బీజేపీ నేతలు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, అడ్వాణీలకు సన్నిహితుడిగా, పరిపాలనాదక్షుడిగా ఆయనకు పేరుంది. 

ఏపీ గవర్నర్‌ విచారం: లాల్జీటాండన్‌ మృతిపట్ల ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ప్రజాజీవితంలో 50ఏళ్లకుపైగా నిరుపమాన సేవలు అందించారని చెప్పారు. లాల్జీ టాండన్‌ కుటుంబసభ్యులకు  తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

ఏపీ సీఎం జగన్‌ సంతాపం: మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఆకస్మిక మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. యూపీ రాజకీయాల్లో ఆయన సుదీర్ఘకాలం విశేష సేవలు అందించారన్నారు.

తెలంగాణ గవర్నర్‌ సంతాపం: టాండన్‌ మృతి పట్ల తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు