పార్టీల విరాళాల్లో పారదర్శకత

3 Jan, 2018 02:10 IST|Sakshi

ఎలక్టోరల్‌ బాండ్ల విధి విధానాల ఖరారు

వేయి, పదివేలు, లక్ష, 10 లక్షలు, కోటి మొత్తాల్లో బాండ్లు

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకిచ్చే విరాళాల్లో పారదర్శకత కోసం అమల్లోకి తేనున్న ఎలక్టోరల్‌ బాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ బాండ్ల జారీకి సంబంధించిన విధివిధానాల్ని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం ప్రకటించారు. విరాళాలిచ్చే దాతలు ఎలక్టోరల్‌ బాండ్లను ఎస్‌బీఐ(స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) నుంచి కొనుగోలు చేయాలని, రాజకీయ పార్టీలు ఆ బాండ్లను ఈసీకి సమర్పించిన బ్యాంకు ఖాతా ద్వారా సొమ్ము చేసుకోవాలని ఆయన వెల్లడించారు. రాజకీయ పార్టీలకిచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న ఈ ఎలక్టోరల్‌ బాండ్లు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్‌ నెలల్లో పది రోజుల పాటు ఎంపిక చేసిన ఎస్‌బీఐ శాఖల్లో అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలున్న సంవత్సరంలో మాత్రం 30 రోజుల పాటూ బాండ్లను విక్రయిస్తారు. కొనుగోలు అనంతరం 15 రోజుల పాటు ఇవి చెల్లుబాటు అవుతాయి. బాండ్లపై విరాళమిచ్చే దాత పేరు ఉండదని, అయితే వాటిని కొనుగోలు చేసే వ్యక్తి లేక కంపెనీ.. బ్యాంకుకు కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని జైట్లీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని ఖరారు చేసిందని వెల్లడించారు.  

కనీసం 1 శాతం ఓట్లు సాధించిన పార్టీలకే
ప్రామిసరీ నోటును పోలిఉండే ఎలక్టోరల్‌ బాండ్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీ ఇవ్వవు. బాండ్లలో పేర్కొన్న మొత్తాన్ని రాజకీయ పార్టీలకు చెల్లించేవరకు వాటిపై పూర్తి హక్కులు దాతకే చెందుతాయి. అయితే గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1 శాతం ఓట్లు గెలుచుకున్న రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ బాండ్ల సొమ్మును చెల్లిస్తారు. అందుకోసం పార్టీలు ఎన్నికల సంఘానికి బ్యాంకు ఖాతాను ఇవ్వాల్సి ఉంటుంది. ‘రూ. 1000, రూ. 10 వేలు, రూ. లక్ష, రూ. 10 లక్షలు, రూ. కోటి మొత్తాల్లో బాండ్లను దాతలు కొనుగోలు చేయవచ్చు. భారతీయ పౌరులు, భారత్‌లోని కార్పొరేట్‌ సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేసేందుకు అర్హులు. అయితే బాండ్లపై కొనుగోలు చేసిన వ్యక్తి పేరు ఉండదు. 15 రోజుల్లోగా పార్టీలు వాటిని సొమ్ము చేసుకోవాలి’ అని కేంద్ర మంత్రి జైట్లీ లోక్‌సభలో వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే సందేహం వ్యక్తం చేస్తూ.. బాండ్లపై విరాళమిచ్చే వ్యక్తి పేరు లేకపోతే ఉపయోగమేంటని ప్రశ్నించగా.. విరాళమిచ్చే వ్యక్తుల ఆస్తి అప్పుల పట్టీలో బాండ్లలో పేర్కొన్న మొత్తాల్ని నమోదు చేస్తారని జైట్లీ సమాధానమిచ్చారు.  

గత బడ్జెట్‌లో ఎలక్టోరల్‌ బాండ్ల ప్రస్తావన
ప్రస్తుతం రాజకీయ పార్టీలకు దాదాపు అన్ని విరాళాలు నగదు రూపంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అందుతున్నవే... ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరి 1న.. 2017–18 బడ్జెట్‌ ప్రసంగంలో ఎలక్టోరల్‌ బాండ్ల ఆలోచనను జైట్లీ ప్రకటించారు. రాజకీయ పార్టీలకు అందే విరాళాలు మరింత పారదర్శకంగా ఉండేందుకు ఈ విధానం ఉపకరిస్తుందన్నారు. ఆ బడ్జెట్‌లో రూ. 20 వేలకు బదులు నగదు విరాళాలపై రూ. 2 వేల పరిమితి పెట్టడంతో పాటు.. డిజిటల్‌ విరాళాల్ని స్వీకరించేందుకు పార్టీలకు అనుమతిచ్చారు.   

పార్టీలు ఈసీకి రిటర్న్స్‌ సమర్పించాలి..
‘బాండ్లను సమాంతర నగదుగా వినియోగించకుండా ఉండేందుకే 15 రోజుల గడువు విధించాం. గత అనుభవాల దృష్ట్యా బాండ్లపై విరాళమిచ్చే వ్యక్తి పేరును పేర్కొనడం లేదు. వారి పేర్లు బయటికొస్తే.. మళ్లీ నగదు విరాళాల వైపు మొగ్గు చూపే అవకాశముంది. కొత్త విధానంలో ఏ పార్టీకి నగదు ఇస్తున్నారో విరాళమిచ్చే వ్యక్తి తెలుసుకోవచ్చు. ప్రతి రాజకీయ పార్టీ ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా తమకు ఎంత నగదు అందిందో తప్పనిసరిగా ఎన్నికల సంఘానికి రిటర్న్స్‌ సమర్పించాలి. అయితే ఈ విధానంలో ఏ వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి విరాళం ఇస్తున్నాడో అన్న విషయం మాత్రం తెలియదు’ అని జైట్లీ చెప్పారు.  

మరిన్ని వార్తలు