వరికి మద్దతు రూ.53 పెంపు

2 Jun, 2020 06:13 IST|Sakshi

కందులకు రూ. 200, మినుములకు రూ. 300 పెంపు

మద్దతు ధరలను పెంచిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: ఆహార, వాణిజ్య పంటల కనీస మద్ధతు ధర(ఎమ్మెస్పీ)లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరి మద్ధతు ధరను స్వల్పంగా రూ. 53 పెంచింది. ఈ పెంపుతో వరి క్వింటాల్‌ ధర సాధారణ రకం రూ. 1,868కి, ఏ గ్రేడ్‌ రకం రూ. 1888కి చేరింది. నూనె గింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలకు గణనీయంగా పెంచింది. ప్రస్తుత 2020–21 పంట సంవత్సరానికి(2020 జూలై– 2021 జూన్‌) ఈ ఎమ్మెస్పీ వర్తిస్తుంది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో ఈ కనీస మద్దతు ధర పెంపు ప్రతిపాదనలను ఆమోదించారు. అత్యధికంగా గడ్డి నువ్వులు(నైజర్‌ సీడ్స్‌)కు క్వింటాలుకు రూ. 755 పెంచారు. నువ్వులకు రూ. 370, మినుములకు రూ. 300, పత్తికి రూ. 275 మేర పెంచారు. మద్దతు ధర పెంపులో ఉత్పత్తి వ్యయంపై మెరుగైన ప్రతిఫలంతోపాటు, వైవిధ్య పంటల ప్రోత్సాహం అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. పంట ఉత్పత్తి వ్యయంపై అదనంగా కనీసం 50 శాతం ప్రతిఫలం లభించేలా కనీస మద్దతు ధర ఉండాలని 2018–19 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా మద్దతు ధరలను ప్రకటించారు. ఉత్పత్తి వ్యయానికి అదనంగా సజ్జల(బాజ్రా)కు 83%, మినుములకు 64%, కందులకు 58%, మొక్కజొన్నకు 53%, ఇతర పంటలకు కనీసం 50% మేర ప్రతిఫలం వస్తుందని ప్రభుత్వం తెలిపింది.

ఖరీఫ్‌ సీజన్‌లో వరి ప్రధాన పంట. ఇప్పటికే 35 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు. ‘కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ కాస్ట్స్‌ అండ్‌ ప్రైసెస్‌ సిఫారసుల మేరకు 2020–21 సంవత్సరానికి గానూ 14 ఖరీఫ్‌ పంటలకు మద్ధతు ధరలను పెంచేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వివిధ పంటలపై, దిగుబడి ఖర్చుపై 50% నుంచి 83% వరకు రైతుకు లాభం వచ్చేలా ధరల పెంపు ఉంది’ అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్‌ తెలిపారు. వరి దిగుబడి వ్యయాన్ని సాధారణ రకానికి రూ. 1245, ఏ గ్రేడ్‌ రకానికి రూ. 1246గా నిర్ధారించి, దానిపై 50% ప్రతిఫలం లభించేలా కనీస మద్దతు ధర నిర్ణయించామన్నారు. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు వాటి ఎమ్మెస్పీని గణనీయంగా పెంచారు. రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించే తేదీని ఆగస్ట్‌ 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
 

మరిన్ని వార్తలు