కేబినెట్‌ కీలక నిర్ణయాలు : ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు

28 Aug, 2019 20:13 IST|Sakshi
కేంద్ర మంత్రులు పియూష్‌ గోయల్‌, ప్రకాష్‌ జవదేకర్‌,

డిజిటల్‌ మీడియాలో 26 శాతం విదేశీ  ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి

కోల్‌ మైనింగ్‌లో 100 శాతం  ఎఫ్‌డీఐలకు గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, న్యూఢిల్లీ :  కేంద్రప్రభుత్వం వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తెరిచింది. ఈ మేరకు బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్‌  కీలక నిర్ణయాలను వెలువరించింది. మందగమనంలో ఆర్థిక వృద్ధిని చక్కదిద్దే ప్రయత్నాల్లో భాగంగా నాలుగు రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధనలను మరింత సరళీకృతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎప్‌డీఐలు కొద్దిగా మందగించాయి. అందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రకాష్‌ జవదేకర్‌,  పియూష్‌ గోయల్‌ వెల్లడించారు.

ప్రధానంగా బొగ్గు తవ్వకాలు, సంబంధిత ప్రాసెసింగ్ కార్యకలాపాలు ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం పెట్టుబడులకు అనుమతి వుంటుందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. కాంట్రాక్ట్‌ మాను ఫ్యాక్చరింగ్‌ రంగంలో 100 శాతం,  డిజిటల్‌ మీడియాలో 26శాతం,  బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసుల్లో 49 శాతం పెట్టుబడులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే సింగిల్ బ్రాండ్ రిటైల్ లో ఎఫ్‌డీఐ కోసం స్థానిక సోర్సింగ్ నిబంధనలు (30 శాతం స్థానికంగా కొనుగోళ్లు తప్పనిసరి) సడలించినట్టు గోయల్ చెప్పారు. అలాగే ఆన్‌లైన్‌ సేల్స్‌కు అనుమతినిచ్చామన్నారు. అయితే మల్టీ ‍ బ్రాండ్‌ రీటైల్‌ లో పెట్టుబడుల గురించి కేబినెట్‌లో చర్చించలేదన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు జవదేకర్ తెలిపారు. రూ. 24,375 కోట్ల పెట్టుబడితో 2021-22 నాటికి 75 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 529 కాలేజీల్లో 70,978  సీట్లు అందుబాటులో ఉన్నాయని, తాజా నిర్ణయంతో 15,700 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా లభించనున్నాయని కేంద్రమంత్రి జవదేకర్‌ వెల్లడించారు.  60 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర ఎగుమతులకు ప్రభుత్వం 6,268 కోట్ల సబ్సిడీని ఇవ్వనుంది. ఈ రాయితీ నేరుగా రైతు ఖాతాకు బదిలీ అవుతుందనీ,  చక్కెర సీజన్ 2019-20లో మిగులు నిల్వలను ఖాళీ చేయడానికి తమ చక్కెర ఎగుమతి విధానం సహాయపడుతుందని జవదేకర్ చెప్పారు. భారతదేశంలో 162 లక్షల టన్నుల చక్కెర నిల్వ ఉంది, అందులో 40 లక్షల టన్నులు బఫర్ స్టాక్‌గా ఉంటుందన్నారు.  దీంతోపాటు విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కోసం అంతర్జాతీయ కూటమి (సిడిఆర్‌ఐ) ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019 సెప్టెంబర్ 23 న న్యూయార్క్‌లో జరిగే యుఎన్ క్లైమేట్ సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ సీడీడిఆర్‌ఐని ప్రారంభించనున్నట్లు జవదేకర్ ప్రకటించారు.

మరిన్ని వార్తలు