ఖైదీల‌కు గుడ్ న్యూస్..మ‌రో 8 వారాలు సేఫ్‌గా!

26 May, 2020 09:53 IST|Sakshi

ల‌క్నో :  భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో 2,234 మంది ఖైదీల‌కు మ‌రో రెండు నెల‌ల ప్ర‌త్యేక పెరోల్ మంజూరు చేయాల‌ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక సీనియర్ అధికారి వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో 71 జైళ్ల‌లో ఉన్న 2,234 మంది ఖైదీను 8 వారాల పాటు పెరోల్‌పై విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా దాన్ని మ‌రో 8 వారాలు పొడిగించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు హోంశాఖ అద‌న‌పు ప్రధాన కార్యదర్శి అవనీష్ అవస్థీ పేర్కొన్నారు. ఈ మేర‌కు మే 25న ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.  (ఖైదీకి కరోనా.. క్వారంటైన్‌కు 100 మంది )

దేశంలో మ‌హ‌మ్మారి వైర‌స్ పంజా విసురుతున్న నేప‌థ్యంలో గ‌రిష్టంగా ఏడు సంవ‌త్స‌రాల జైలు శిక్ష విధించిన కేసుల‌లో ఖైదీల‌ను పెరోల్ లేదా మ‌ధ్యంత‌ర బెయ‌ల్‌పై విడుద‌ల చేయడాన్ని ప‌రిశీలించ‌డానికి క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని ఇప్ప‌టికే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. జైళ్లల్లో సామాజిక దూరం పాటించ‌డం చాలా క‌ష్ట‌త‌ర‌మైన విష‌యం. దీంతో జైళ్లలో అధిక ర‌ద్దీ కార‌ణంగా క‌రోనా ఎక్కువ‌గా ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని సుప్రీం అభిప్రాయ‌ప‌డింది. దీంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఖైదీల‌కు ఇచ్చిన పెరోల్ గ‌డువును మ‌రో 8 వారాలు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.  (మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ )


 

మరిన్ని వార్తలు